26-12-2025 12:59:50 AM
ఆలేరు, డిసెంబర్ 25 (విజయక్రాంతి): పెండింగు పాల బిల్లును వెంటనే చెల్లించాలని కోరుతూ ఆలేరు పాలశీతల కేంద్రం ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలేరు, యాదగిరిగుట్ట మండలాలలో పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పాల బిల్లుల బకాయిలు ఉండడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని, లేదంటే రాజీనామా చేసేవరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా ఈ ధర్నాకు సిపిఎం జిల్లా నాయకులు ఇక్బాల్, బిజెపి నాయకులు నంద గంగేష్, కామిటికారి కృష్ణ మరియు వివిధ పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్ లు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పశుల సతీష్ రెడ్డి, మోటే శంకర్, భూష శ్రీశైలం, ఊదరి రాములు, మైదం రంగయ్య, తీపిరెడ్డి సురేందర్ రెడ్డి, కృష్ణ, పారెల్లి నారాయణ, చిరబోయిన రాజయ్య మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.