అధికం అనర్థం
- రసాయనిక ఎరువులతో ముప్పు
- సేంద్రియ సాగుతో లాభం
వెల్దుర్తి, ఆగస్టు 18 (విజయక్రాంతి) ః మోతాదుకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దిగుబడులు తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాలని సూచిస్తున్నారు. సాగుపై ప్రాథమిక సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు అధిక రసాయన ఎరువులు వాడుతున్నట్లు తెలుస్తోంది. వరిలో ఎకరాకు 50 కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాల్సి ఉండగా రైతులు రెండు బస్తాలకు తగ్గకుండ డీఏపీ వాడుతున్నారు. నాటే సమయంలో 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా ఈ పద్దతి పాటించడం లేదు. వరిలో 30 కేజీల చొప్పున నాలుగు సార్లు యూరియా వాడాలి. పొట్ట దశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు.
పత్తి సాగులో ఇలా...
పత్తి విత్తేకంటే ముందే ఎకరాకు 50 కేజీ ల డీఏపీ వాడాలి. వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే ఫలితం ఉం టుందని అధికారులు అంటున్నారు. రైతు లు రెండు నుంచి మూడు బస్తాల వరకు జ ల్లుతున్నారు. దీనివల్ల అంతగా లాభం ఉండదని, కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుందని సూచిస్తున్నారు.
ఎక్కువ భాస్వరంతో నష్టం...
అధిక మోతాదులో భాస్వరం వాడితే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత నేల దెబ్బతింటుందని అధికారులు పేర్కొన్నారు. భాస్వరం భూమి లోపల నిల్వ ఉండి పంటలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు.
సేంద్రియ ఎరువులు తప్పనిసరి...
సాగులో రసాయన ఎరువులు వాడటం వల్ల సారం తగ్గిపోయి భూమి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా దిగుబడులు తగ్గిపో తాయి. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల దిగుబడులు పెరిగి ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే భూమి సారవంతమవుతుంది.
సమతుల్యత ఏదీ ?
ప్రతి మొక్కకు నత్రజని, భాస్వరం, పొటా ష్, ఎరువులతో పాటు సూక్ష్మపోషకాలు కూడా అవసరం. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువు లు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతున్నారు.దీంతో పోష కాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మపోషకాల అవసరాన్ని రైతు లు గుర్తించక పోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి.
అవగాహన కల్పిస్తాం..
మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల నష్టం జరుగుతుంది. ఏ సమయంలో పైరుకు ఎంత మోతాదులో ఎరువు అవసరమో రైతులకు సూచిస్తాం. భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తాం. రైతులు అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. రైతులంతా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూమి సారవంతమవుతోంది.
- వందన, ఏఈఓ, వెల్దుర్తి
రూ.3వేలు ఇవ్వాలి..
ఏటేటా పంటల పెట్టుబడి, ఖర్చులు పెరుగుతున్నాయి. పండించిన పంటలకు మాత్రం మద్దతు ధర రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం వరికి ఏడాది రూ.117 పెంచింది. ఆశించిన స్థాయిలో మద్దతు ధరను పెంచడం లేదు. వరికి కనీసం క్వింటాల్‌కు రూ.3వేలు ఇవ్వాలి.
వెన్నవరం
మోహన్‌రెడ్డి, రైతు, వెల్దుర్తి
కేంద్రం పెంచిన మద్దతు ధర ఇలా..(క్వింటాల్)
పంట 2023-24 2024-25 పెరిగింది
(రూ.లో)
వరి(సాధారణం) 2,183 2,300 117
వరి (ఏ-గ్రేడ్) 2,203 2,320 117
పత్తి (మధ్యస్థ పింజ) 6,620 7,121 501
పత్తి (పొడవు పింజ) 7,020 7,521 501
నువ్వులు 8,636 9,267 632
జొన్నలు (హైబ్రీడ్) 3,180 3,371 191
జొన్నలు (మూల్డండ్) 3,225 3,421 196
సజ్జలు 2,500 2,625 123
మొక్కజొన్న 2,090 2,225 135
రాగులు 3,846 4,290 444
కందులు 7,000 7,550 550
పెసర్లు 8,558 8,682 124
మినుములు 6,950 7,400 450
పొద్దుతిరుగుడు 6,780 7,280 520
సోయాబీన్ (ఎల్లో) 4,600 4,892 292
వడిసలు 7,734 8,717 983
వేరుశనగ 6,377 6,783 406






