calender_icon.png 11 September, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతికి మోదం

05-09-2025 12:00:00 AM

భారత్‌లో దసరా, దీపావళి పెద్ద పండుగలు. అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను శ్లాబుల కుదింపు రూపంలో పండుగ శోభను కాస్త ముందే తీసుకొచ్చేసింది. పేదలు, మధ్యతరగతికి ఊరట కలిగించేలా పన్ను శ్లాబుల కుదింపునకు బుధవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు నాలుగు శ్లాబులుగా కొనసాగిన జీఎస్టీ ఇకపై రెండు శ్లాబుల్లోనే కొనసాగనున్నది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే ఇకపై కొనసాగనున్నాయి.

ఈ పన్ను మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటివరకు 5 శాతం పన్ను రేటులో ఉన్న టెట్రాప్యాక్ పాలు, పన్నీర్, బ్రెడ్‌లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇక పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన రోటీలు, పరోటాలపై జీఎస్టీ ఎత్తేయడం సానుకూలాంశం.

ఇక 18 శాతం, 12 శాతం పన్ను రేట్లలో ఉన్న హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, నెయ్యి, పాస్తా, హస్తకళాకృతులు, మార్బుల్, గ్రానైట్ సహా వివిధ రకాల ఔషధాలు, మెడికల్ పరికరాలు, సోలార్ ప్యానెళ్లు 5 శాతం శ్లాబులోకి మారనుండడంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు 28 శాతం శ్ల్లాబులో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు 18 శాతం శ్లాబులోకి రానుండడంతో టీవీలు, ఏసీలు, కూలర్లు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్ ధరలు దిగిరానున్నాయి. దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

అందుకు తగ్గట్టుగానే  ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయడం అభినందించాల్సిన విషయం. అయితే హానికర వస్తువుల కేటగిరీలోని పాన్ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు సహా ఖరీదైన కార్లను ప్రత్యేకంగా 40 శాతం శ్లాబును ప్రతిపాదించారు. దీంతో వీటి ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఇక మద్యం, శీతల పానీయాలు, చక్కెర, కెఫిన్ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశముంది.

దాదాపు వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి.. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ పన్ను శ్లాబుల మార్పులు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని నిపుణుల అంచనా. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న 48 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ఈ టారిఫ్‌లు పెద్ద సమస్యగా మారబోతున్నాయి.

ఇక జీఎస్టీ రీఫార్మ్స్, ఆదాయ పన్ను తగ్గింపులు కలిపి వినియోగాన్ని రూ. 5.31 లక్షల కోట్ల వరకూ పెంచుతాయని ఎస్బీఐ రీసెర్చీ ఇటీవలే విడుదల చేసిన నివేదిక పేర్కొంటుంది. ఇది జీడీపీపై 1.6 శాతం ప్రభావం చూపనుంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది.

వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడుతుంది. మొత్తంగా మధ్యతరగతికి మోదం కలిగించేలా ఉన్న కొత్త జీఎస్టీ రూల్స్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఆర్థిక సవాళ్లు తెచ్చిపెట్టబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి.