calender_icon.png 23 December, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలి

23-12-2025 12:16:45 AM

  1.   27 లేదా 28న నిరసన ర్యాలీలు 
  2. జీరాంజీని మా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది 
  3. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  సీతక్క పేర్కొన్నారు. వలసలను అరికట్టేందుకు, వెట్టిచాకిరి నుంచి ప్రజలను విముక్తి చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ  ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

ఆదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు చెందిన మైనింగ్ అవసరాల కోసం తక్కువ కూలీకే కార్మికులను సరఫరా చేయాలనే కుట్రతోనే ఉపాధి హామీ పథకాన్నిరద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ చట్టం రద్దయితే గ్రామాల్లో ఉపాధి లేక కూలీలు కార్పొరేట్ల దోపిడీకి గురవుతారని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం బిక్ష కాదని, హక్కుగా లభించాల్సిన పథకమన్నారు.

ఉపాధి హామీ చట్టం రద్దుకు నిరసనగా ఈ నెల 27 లేదా 28న కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుసభ్యులు  గ్రామా ల్లో ప్రజలతో కలిసి ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని మం త్రి సీతక్క పిలుపునిచ్చారు. పేదల హక్కులను హరించే మోదీ ప్రభుత్వం కుట్రలను ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కొని, చట్టాన్ని కాపాడుకోవాలన్నారు. ఉపాధి పథకం నుంచి గాంధీ పేరును తొలగించడంతో.. మరోసారి గాంధీని హత్యచేసినట్లేనని అన్నా రు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పనిదినాలను తగ్గి స్తూ గ్రామీణ కూలీలు సొంత ఊర్లో పనిచేసే హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ .. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. జీరాంజీ చట్టాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.