06-12-2025 12:16:11 AM
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకరిస్తోంది నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ నిర్మాణ సంస్థ నిర్మాతలు డాక్టర్ అరుళనందు, మాథ్యో అరుళనందు తాజాగా మరో కొత్త చిత్రం ‘హైకు’ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సైతం విడుదల చేశారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఏగన్ హీరోగా నటిస్తున్నారు. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అపల్ల, ‘మిన్నల్ మురళి’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్.. ఇందులో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తే..
ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. పోస్టర్‌లో హీరోహీరోయిన్ మధ్య చక్కటి కెమిస్ట్రీ కనిపిస్తోంది. యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు, వారు కనే కలల నేపథ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. త్వరలోనే సినిమాలోని నటీనటులకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సహా ఇతర వివరాలను రిలీజ్ చేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; సినిమాటోగ్రఫీ: ప్రియేశ్ గురుసామి; ఎడిటర్: శక్తి ప్రాణేశ్; ఆర్ట్: విజు విజయన్.