06-12-2025 12:17:28 AM
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఈయూఎఫ్‌ఎఫ్) 2025 హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో విజయవంతంగా ముగిసిన ఈయూఎఫ్‌ఎఫ్ 30వ ఎడిషన్ ఇప్పుడు హైదరాబాద్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ వేడుకలు డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఇందులో భాగంగా స్థానికంగా ఎంపిక చేసిన మూడు వేదికలు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, శ్రీ సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్, హైదరాబాద్‌లలో ప్రదర్శనలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 23 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవానికి సారథి స్టూడియోస్ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్, ఈయూ ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కేవీ రావు, టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, అలయన్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ మౌద్ మీక్వావు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కే శ్రీనివాస్, సినీ ప్రముఖులు,
సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కేవీ రావు మాట్లాడుతూ.. “ప్రపంచ సినీకళను హైదరాబాద్ ప్రేక్షకులకు పరిచయం చేస్తూ 50 ఏళ్లుగా మా క్లబ్ సేవలందిస్తోంది. వరల్డ్ క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ నగరంలో ఇలాంటి ఫెస్టివల్‌ను నిర్వహించడం మాకు గర్వకారణం” అన్నారు.
అలయన్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ మౌద్ మీక్వావు మాట్లాడుతూ: “ఫెస్టివల్‌లో ప్రదర్శించే ప్రతి సినిమా ప్రేక్షకుల హదయాలను హత్తుకుంటుందని నమ్ముతున్నాం,” అన్నారు. ఈయూ డెలిగేషన్ సెకండ్ సెక్రటరీ లోరెంజో పర్రుల్లి మాట్లాడుతూ.. “గత ఏడాది హైదరాబాద్‌లో ఫెస్టివల్‌కు వచ్చిన సానుకూల స్పందన మమ్మల్ని మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసింది.
ఈసారి 23 యూరోపియన్ సినిమాలను ప్రదర్శిస్తున్నాం. కథల పట్ల, చిత్ర సృష్టి పట్ల హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రేమ ప్రత్యేకం. ఇండో సాంస్కృతిక సంభాషణను మరింతగా బలోపేతం చేయడం మా ముఖ్య లక్ష్యం” అని తెలిపారు.