02-08-2025 12:00:00 AM
మంచిర్యాల, ఆగస్టు 1(విజయక్రాంతి) : పురుషులతో సమానంగా మహిళా పోలీసు సిబ్బందికి అన్ని రకాల డ్యూటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని, పురుషుల మాదిరిగానే వారు బాధ్యతలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర రాజా బహదూర్ వెంకట రమణా రెడ్డి (ఆర్బీవీఆర్‌ఆర్) పోలీస్ అకాడమీ డైరెక్టర్ అబిలాష్ బిస్త్ స్పష్టం చేశారు.
శుక్రవారం నస్పూర్లోని సింగరేణి కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్‌ఓ, మహిళా సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పోలీసు శిక్షణ సమయంలో మహిళలు, పురుషులు ఒకే విధంగా శిక్షణ పొందుతున్నారని. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వ్యత్యాసం చూపుతున్నారని ఇది మారాలన్నారు.
మహిళా సిబ్బంది పోలీస్ స్టేషన్ లోపల చేసే రిసెప్షన్, రికార్డు, క్రిమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్), టెక్ టీం పనులతో పాటు బయట విధులైన కమ్యూనిటీ పోలిసింగ్, బ్లూ కోలట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ల విచారణ, కోర్టు డ్యూటీ, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, ట్రాఫిక్, బందోబస్తు వంటి బాధ్యతల్లోనూ పాల్గొనాలన్నారు.
మహిళా సిబ్బందికి స్కూటీలు కల్పించి, డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లా రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.