21-08-2025 10:12:48 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పండుగలను ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఎస్. పి. కాంతిలాల్ సుభాష్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏ ఎస్.పి. చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి గణపతి నవరాత్రులు, మిలాద్ ఉన్ నబి వేడుకల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, మస్జిద్ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పండుగలను ప్రజలందరూ కలిసి సామరస్యంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ సౌకర్యం, మండపాల వద్ద పారిశుధ్యం పనులు చేపట్టాలని, నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రహదారులపై గుంతలు పూడ్చాలని, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మండల కేంద్రాలలో నిమజ్జనం జరిగే ప్రాంతాలలో మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిమజ్జనం రోజున గణేష్ శోభయాత్రలను నిర్వాహకులు వరుస క్రమంలో ఉండేలా పోలీస్ అధికారులకు సహకరించాలని, భారీ శబ్దాలు రాకుండా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజలందరూ మతసామరస్యంతో పండుగలను నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డి ఎస్ పి రామానుజం, ఎక్సైజ్ పర్యవేక్షకులు జ్యోతి కిరణ్, విద్యుత్ ఎస్. ఈ. శేషరావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, తహసిల్దార్లు రియాజ్ అలీ, మధుకర్, సి. ఐ.లు, ఎస్. ఐ.లు, సంబంధిత అధికారులు, శాంతి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.