calender_icon.png 22 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

52 అడుగుల వద్ద గోదావరి

22-08-2025 12:40:37 AM

  1. భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న దక్షిణ గంగ
  2. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

భద్రాచలం/చర్ల, ఆగస్టు 21(విజయక్రాం తి): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. వర్షాలు తగ్గుమొఖం పట్టినా, దక్షిణగంగలో వరద కొనసాగుతుంది. భద్రాచలం వద్ద రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 48 అడుగులతో ప్రవహించడం తో రెండో హెచ్చరిక జారీ చేసిన అధికారులు, గురువారం 11 ఉదయం 51.2 అడు గులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు గోదావరి ఉగ్రరాపం దాల్చి 51.9 అడుగుల మేర ప్రవహించింది. నదిలో 13,66,298 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు వచ్చి చేరడంతో పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్లే నేషనల్ హైవే గుండాల రాయనపేట మధ్య ఉన్న రోడ్డుపై గోదావరి బ్యాక్ వాటర్ ప్రవహించింది.

దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రా ప్రాంతాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం నుంచి చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లే మరో రోడ్డు దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద గోదావరి వరదతో మునిగిపోయింది. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో భక్తులను గోదావరి స్నానానికి అనుమతించలేదు. భద్రా చలం దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాల రామాలయానికి వెళ్లే రహదారులు సైతం నీటిలో మునిగిపోయాయి.

సీత మ్మ వాగు విస్తృతంగా ప్రవహించటంతో నార చీరల ప్రాంతం సీతమ్మ వారు సంచరించిన ప్రాంతాలు మునిగిపోయాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గోదావరి కరకట్ట ప్రాంతంలో, ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ముందు జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీశాఖ అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరగడంతో చర్ల ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చర్ల మీదుగా భద్రాచలం వెళ్లేందుకు దుమ్ముగూడెం వద్ద జరుగుతన్న కల్వర్టు నిర్మాణ పనులు వద్ద కల్వర్టు ప్రాంతం జలమయమైంది. 

చర్ల మండలంలోని తాలుపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి సుమారు 7,325 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్లు సైతం జలమయమయ్యాయి. వెంకటాపురం మండ లం బోధపురం, కొండాపురం మధ్యలో ఉన్న వంతెనపై వరద చేరడంతో అధికారు లు భద్రాచలం, చర్ల, వెంకటాపురం రాకపోకలను నిలిపివేశారు.