calender_icon.png 29 January, 2026 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబురాల సంక్రాంతి

15-01-2026 02:14:33 AM

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే కాలాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు గనుక మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. పుష్యమాసం, హేమంత ఋతువులో ప్రకృతి అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనుర్మాసం ఆరంభం నుంచి పండుగ వెళ్లేదాకా ఇంటి ముంగిట ముచ్చటైన ముగ్గులు కనువిందు చేస్తాయి. ఈ మాసంలో చలి విజృంభిస్తున్నప్పటికీ మహిళలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కళ్లాపి చల్లి రంగవ ల్లులు తీర్చిదిద్ది అందులో గొబ్బిళ్ళు పెట్టడం మన తెలంగాణ సంప్రదాయం. ముద్దబంతి పూలు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలను తయారుచేసి ముత్యాల ముగ్గులపై ఉంచి శోభాయమానంగా ఆడుతూ, పాడుతూ సందడి చేస్తారు. ఈ నెలలోనే హరిదాసులు, గంగిరెద్దులవారు మన ఇంటి ముంగిట దర్శనమిస్తారు. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే పండుగల్లో మొదటి రోజూ భోగి పండుగ.  భోగి అంటే సమస్త భోగాలను సమకూర్చేదని అర్థం.

ఆ రోజు తెల్లవారు జామునే లేచి ఇళ్ల ముందు భోగి మంట లు వేసి, ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో దహనం చేయడం ఆనవాయితీ. మంచు కురిసే శీతాకాలం ఉషోదయపు వెలుగులో, తెలుగువారి వాకిలి ముంగిట వేసే భోగి మంటలు, మనలోని చెడును మంటల్లో దహనం చేసి సజీవతత్వాన్ని గ్రహించి అగ్నిలాగా ప్రశాంతంగా వెలగాలనే పరమార్థాన్ని తెలియజేస్తుంది. సాయంత్రం పిల్లలకు దిష్టి దోషాలు పోవాలని బోగి పండ్లు పోయడం ఆనవాయితీ. భోగి మరునాడు వచ్చే సంక్రాంతి పర్వదినం ఉత్తరాయణంతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ వచ్చే పుష్యమాసకాలంలో ప్రకృతి రమణీయమైన అందాలు సంతరించుకొని పరవశించి పోతుంటుంది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ రోజు స్వర్గద్వారాలు తెరవబడతాయని శాస్త్రం చెబుతోంది. మకర సంక్రాంతి రోజున చేసే దానధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయని చెబుతారు.

ఈ రోజు కూడా హరిదాసులు, గంగిరెద్దుల ఆటల ఆహ్లాదం, రంగవల్లుల హడావుడి ఉంటుంది. మకర సంక్రాంతి నాడు దానధర్మాలు చేయాలనేది శాస్త్రవచనం. ఉత్తరాయణం పితృదేవతలకు ఆరాధనాకాలం. శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమానికి పితృదేవతలకు దర్పణాలు ఇవ్వాలి. కానీ, మిగతా పదకొండు సంక్రమాణాల్లో చేయకపోయినా, మకర సంక్రమణం రోజు మాత్రం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలంటారు. సంక్రాంతి మరునాడు వచ్చేది కనుమ పండుగ.  ఈ రోజున ఏడాదిపాటు తమకు పాడి పంటలకు సహకరించిన పశువులను శుభ్రంగా కడిగి రంగులతో, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.  కోడిపందేలు, గాలిపటాలు, గంగిరెద్దులాడించేవాళ్ళు, హరిదాసుల కీర్తనలతో పండుగ సందడిగా ఉంటుంది. ఇలా మన సాంప్రదాయాలను గుర్తుచేస్తూ ప్రకృతికి, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తూ, ఆప్యాయతలు, అనుబంధాలను పెంచుతుంది. మూడు రోజులు ప్రకృతి అంతా సింగారించుకొన్న నవవధువులా కనిపించి జీవరాసులన్నీటికీ ఆహ్లాదం కలిగిస్తుంది.  సంక్రాంతి పండుగను భావితరాలు రక్షించుకోవాల్సిన అవసరముంది.  

కాయల నాగేంద్ర, 8500286687