15-01-2026 02:12:31 AM
పశ్చిమాసియా దేశం ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభానికి తోడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ నియంత పాలనను వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అయితే దేశ ప్రజలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు ప్రజల ప్రాణాలను హరించివేస్తున్నాయి. ఇప్పటివరకు ఆందోళనల్లో దాదాపు 2,500 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను ‘దేశ భక్తులంటూ’ పేర్కొనడం, నిరసనలు కొనసాగించాలని ప్రోత్సహించడం, ప్రభుత్వం సంస్థలను స్వాధీనం చేసుకోవాలనడం, దాడులు చేసే వారి పేర్లను గుర్తుపెట్టుకోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఊరుకోకుండా ‘మీరు ఆందోళనలు కొనసాగించండి. త్వరలోనే మీకు సాయం అందుతుంది. అదే పనిలో ఉన్నాం’ అని నిరసనకారులనుద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌పై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాడి చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇరాన్ వ్యాపారాలను దెబ్బతీస్తే ఏకాకిగా మారి దారికి వస్తుందన్న యోచనతో తొలుత ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, యూరప్ దేశాల కఠిన ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌ను ట్రంప్ చర్య మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లయింది.
ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, చైనా, తుర్కియే తదితర దేశాలున్నాయి. ఇరాన్‌తో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పరిమితంగానే ఉన్నాయని, ట్రంప్ చర్యల వల్ల మనకు పెద్దగా నష్టం ఉండదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఇరాన్ కూడా తక్కువేమి తినలేదు. అమెరికాపై కోపంతో ఇరాన్ తమ సొంత దేశాన్ని ఆగమాగం చేసుకుంటున్నట్లుగా అనిపిస్తున్నది. సుప్రీం లీడర్ ఖమేనీని దూషించిన నేరానికి 26 ఏళ్ల నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీని బహిరంగంగా ఉరి తీస్తామని ప్రకటించడం సంచలనం కలిగించింది. దేశ ప్రజలు చేస్తున్న నిరసనలు శాంతియుతంగా అడ్డుకోవాల్సింది పోయి తమకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారన్న కారణంతో ఆ దేశ ప్రభుత్వమే ఉరి తీయడానికి సిద్ధపడడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించొచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న నానుడిని అమెరికా చర్యలతో ఇరాన్ పూర్తిగా పక్కనబెట్టేసినట్లుగా అనిపిస్తున్నది.
ఒకవేళ ఇర్ఫాన్‌ను ఊరి తీస్తే మాత్రం ఖమేనీ సహా ఇరాన్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ చర్యల పట్ల ఇరాన్ ప్రభుత్వం భగ్గుమంది. అమెరికా దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, మా దగ్గర క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ ఎవరి ముందు తలవంచదని, అమెరికా రాజకీయ నాయకులు మోసపూరిత చర్యలు మానుకోవాలని సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. గతేడాది జూన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షంతో ఇరాన్ బలహీనపడినప్పటికీ, క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది. ట్రంప్ చర్యలకు బదులుగా ఇరాన్ ఎలాంటి జవాబిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.