calender_icon.png 17 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం తండ్లాట

17-08-2025 12:31:25 AM

  1. మహబూబాబాద్ జిల్లాలో బారులు 
  2. అధికారులతో రైతుల వాగ్వాదం
  3. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో

మహబూబాబాద్/ గార్ల/ గజ్వేల్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెల్లారింది మొదలు.. యూరియా కోసం రైతులు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అటు వర్షాలు ఆశించిన మేర కురవడంతో వరి సాగు, మొక్కజొన్న పంటకు యూరియా అవసరం పెరిగిపోవడంతో రైతులు యూరియా కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

శనివారం ఉదయం మహబూబాబాద్ జిల్లా లోని బయ్యారం మన గ్రోమోర్ సెంటర్ ఎదుట యూరియా కోసం వందల మంది రైతులు బారులు తీరారు. ఇదేవిధంగా కేసముద్రం సొసైటీ ఎరువుల విక్రయ షాపు వద్ద కూడా రైతులు పెద్ద సంఖ్యలో చేరి గంటల తరబడి నిలబడలేక తమ చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు. ఇక జిల్లా కేంద్రంలోని సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రానికి యూరియా లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద ఎ త్తున తరలివచ్చారు.

లారీ నుంచి గోదాములోకి దించకుండానే రైతులకు ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింప చేసి యూరియా ఇప్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరి యా కోసం ఎన్నాళ్లు ఇలా గోసపడాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదునులో వ్యవసాయానికి అవసరమైన యూరియాను ఇప్పించేందుకు కేంద్ర రాష్ర్ట ప్రభు త్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాం డ్ చేశారు.

సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలో రాస్తారోకో 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రాజీవ్ రహదారి రిమ్మనగూడ వద్ద బీఅర్‌ఎస్ పార్టీ  గజ్వేల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో  పార్టీ శ్రేణులు, రైతులతో  పెద్దఎత్తున రాజీవ్ రహదారిపై ధ ర్నా నిర్వహించారు. దాదాపు గంటసేపు  రాస్తారోకో కొనసాగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, వంటేరు ప్ర తాపరెడ్డి మాట్లాడుతూ  పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎన్నడూ కూడా యూరియా కొరత చూడలేదన్నారు.

రైతులు రోడ్లపైకి రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. గజ్వేల్‌లో రైల్వే రేక్ పాయింట్‌ను పునరుద్ధరించి రైతులకు యూ రియా అందుబాటులో ఉంచి యూరియా కొరత లేకుండా  వెంటనే  సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్ద లైన్‌లో నిలబడితే అధికారులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గజ్వేల్‌లో రేక్ పాయింట్ తీసేసారని, రైతులకు యూరియా అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించారు. రాష్ర్టంలో యూరియా కొరత ఉన్న పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందు కు మాట్లాడడం లేదని నిలదీశారు. గజ్వేల్‌లోని రైల్వే రేక్ పాయింట్‌ను వచ్చే వారం రో జులలో పునరుద్ధరించి రైతులకు యూరి యా అందుబాటులో ఉంచాలని, లేనిపక్షం లో రాజీవ్ రహదారిని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.

జిల్లాకు కేటాయించిన యూ రియా మొత్తాన్ని హుస్నాబాద్  వైపు పంపి గజ్వేల్, సిద్దిపేటలో కొరత సృష్టించి కేసీఆర్‌ను ప్రజలలో దోషిగా చిత్రీకరించాలని రే వంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇకనైనా రైతులకు సరిపడా యూ రియాను సరఫరా చేయాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల, మున్సిపల్ నాయకులతోపాటు నియోజకవర్గానికి చెందిన రైతులు పాల్గొన్నారు. 

26 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి రాస్తారోకో ప్రదేశానికి చేరుకుని యూరియా సరఫరాపై  బీఆర్‌ఎస్ నాయకులకు, రైతులకు వివరణ ఇచ్చారు. జిల్లాకు ఆగస్టు నెల వరకు వానాకాలం సీజన్‌లో 31 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉందని, ఇప్పటికే 26 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. వారంలో మరో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కాగా బీఆర్‌ఎస్ రాస్తారోకో నేపథ్యంలో ఏసీపీ నర్సింలు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రజల వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలను కొడకండ్ల నుంచి జగదేవపూర్ మీదుగా హైదరాబాదుకు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను తొగుట రహదారిలో మళ్లించారు. రాస్తారోకో వల్ల అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.