07-07-2025 10:24:26 PM
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of Commerce) ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ఈ జూలైతో గడువు ముగియనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వెంటనే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని పలువురు నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వారు కౌన్సిల్‌కు మెమొరాండం అందజేశారు. ప్రతాని రామకృష్ణగౌడ్, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలింఛాంబర్‌లోని నాలుగు సెక్టార్ల నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “ఇటీవల తెలుగు ఫిలింఛాంబర్‌లో ఈసీ మీటింగ్ నిర్వహించారు. 48 మందికి ఓటు హక్కు ఉండగా, 38 మంది హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడున్న కమిటీ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉన్నారని, అందుకే ఈ కార్యవర్గాన్నే కొనసాగించాలని ఒక ఈసీ మెంబర్ లేఖ రాశాడు. ఆ లేఖను పట్టుకుని 34 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. ఇది మీడియా ద్వారా ప్రచారం చేయించి ఈసారి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈసీ మీటింగ్‌కు రాని ఒక సభ్యుడు ప్రతిపాదించిన దానికి మిగతా వారు ఎలా ఒప్పుకుంటారు” అన్నారు.
“గతంలో కరోనా టైమ్‌లోనే ఎన్నికలు వాయిదా వేశాం. అలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎన్నికల వాయిదా వేస్తారు. అందుకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి దాదాపు నెల రోజుల ముందే తెలియజేయాలి. ఛాంబర్ నిబంధనల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్నికైనా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు ఫిలింఛాంబర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రిప్రంజెటేషన్స్ ఇస్తాం” అని చెప్పారు.
“ఛాంబర్‌లో కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. నిబంధనలు పాటించడంలేదు. వారే తమ స్వార్థంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు. వారికి మిగతా సభ్యులు సపోర్ట్ చేయొద్దని కోరుతున్నాం. ఒకరిద్దరు సభ్యులు మాత్రం తమ ఎన్నిక గడువు ముగిసినందున పదవులకు రాజీనామా చేస్తూ లెటర్స్ రాస్తున్నారు. వారిని అభినందిస్తూ, మిగతా వారు కూడా అలాగే గౌరవంగా ఎన్నికల కోసం ముందుకు రావాలి. ఎన్నికల వాయిదా ప్రతిపాదనకు నొచ్చుకుని ఒకరిద్దరు నిర్మాతలు రాజీనామా చేశారని, వారికి బాసటగా ఉంటాం” అని తెలిపారు.
“చిత్రపురి కాలనీలో అవినీతి జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించే ఫ్లాట్స్‌ను తెలుగు ఫిలిం ఛాంబర్‌కు చెందిన పేద సినీ కార్మికులకు కేటాయించాలి” అన్నారు. మెమొరాండం సమర్పించిన వారిలో నిర్మాతలు గురురాజ్, అల్లాభక్స్, శంకర్‌రెడ్డి, బులెట్ రవి, వింజమూరి మధు తదితరులు ఉన్నారు.