గ్రామ పంచాయతీ ఎన్నికలకు.. 2న ఓటర్ల తుది జాబితా
- జీపీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా ప్రదర్శన
- 28న గ్రామ, మండల పరిషత్ కార్యాలయాల్లో..
- 29న జిల్లా ఎన్నికల అధికారులు, పార్టీల సమావేశం
- 30న ఎంపీడీవోలు, పార్టీల ప్రతినిధులతో భేటీ
- 28 నుంచి 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు పార్టీలు సన్నద్ధం కావడంతో తాజాగా రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులకు రాణి కుముదిని కీలక ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్ కార్యాలాయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 29న జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.






