calender_icon.png 27 August, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి పంగనామం!

27-08-2025 01:05:53 AM

-మోత్కూరు ఎంపీడీఓ ఆఫీసులో ఘరానా మోసం

-మూడేండ్లుగా వాచ్‌మెన్ విధులకు డుమ్మా

-ప్రతినెలా ఠంఛనుగా వేతనం డ్రాసహకరించిన అధికారులకు అమ్యామ్యాలు

-ఇదేంటంటే.. మానవత్వంఅంటోన్న అధికారులు

నల్లగొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): అది మోత్కూరులోని ఎంపీడీఓ కార్యాలయం.. అక్కడ అంతా అవినీతే రాజ్యమేలుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది అమ్యామ్యాలు ముట్టజెబితే చాలు.. విధులకు అటెండ్ కాకున్నా ఫర్వాలేదు. ప్రతినెలా ఠంఛనుగా జీతం తీసుకోవచ్చు. నెలకోసారి మాత్రం అన్ని రోజులకు సరిపడా రిజిష్టరులో సంతకాలు చేసేయోచ్చు.

ఇలా ఒకటీ కాదు రెండు కాదు.. ఏకంగా మూడేండ్ల పాటు ఓ సిబ్బంది వేతనం డ్రా చేస్తూ వచ్చాడు. ఇందుకు ఎంపీడీఓ కార్యాలయ అధికారులు అన్నీ తామై వ్యవహారం నడిపించడం కొసమెరుపు. ఇక అసలు విషయంలోకి వెళితే.. మోత్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా వెంకటేశం అనే వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నారు.

సదరు నైట్ వాచ్మెన్ గత మూడు సంవత్సరాలకు పైగా మోత్కూరు ఎంపీడీఓ కార్యాలయంలోనే ఉద్యోగం చేస్తున్నారు. పేరుకు నైట్ వాచ్మెన్ ఉద్యోగి అయినప్పటికీ ఆయన ఏనాడూ విధులు నిర్వర్తించినా దాఖలాల్లేవ్. మూడేండ్ల కాలంలో నెలలో ఒకరోజు జీతం తీసుకుని సంతకాలు పెట్టేందుకు మాత్రం ఠంఛనుగా అటెండ్ అవుతుంటాడు. రాత్రి సమయంలో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగి కంటికి కన్పించకపోవడం గమనార్హం.

వంత పాడుతున్న ఎంపీడీఓ ఆఫీసు అధికారులు

నైట్ వాచ్మెన్ వెంకటేశానికి మూడేండ్లుగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు అన్నివిధాలా సహకరిస్తున్నట్టు తేలింది. విధులకు రాకున్నా జీతం ఇచ్చేందుకు సదరు వాచ్మెన్ ప్రతినెలా రూ.10వేలు ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు ఇస్తున్నట్టు సమాచారం. వేంకటేశం వాచ్మెన్గా విధుల్లో చేరిన నాటి నుంచి ఇద్దరు ఎంపీడీఓలు మారినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పులేదు.

ఉద్యోగుల అటెండెన్స్కు సంబంధించిన రిజిష్టరులో ఏ రోజుకారోజు ఉద్యోగులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి ఆఫీసుకు రాకపోతే సాయంత్రానికల్లా ఆబ్సెంట్ వేయాలి. కానీ రోజుల తరబడి ఆబ్సెంట్ వేయకుండా నెలలో చివరి రోజు అన్ని రోజులకు సంబంధించిన సంతకాలను ఒకే రోజు చేయించి వేతనాలు డ్రా చేయడం పరిపాటిగా మారింది. దాదాపు మూడేండ్లుగా ఇదే తంతు సాగుతున్నా అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.

మానవతా దృక్పథం అంటోన్న అధికారులు..

వాచ్మెన్ వెంకటేశం విధులకు డుమ్మా కొట్టే వ్యవహారం ఎంపీడీఓ కార్యాలయ అధికారులను అడిగితే.. పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం. పైగా సదరు వాచ్మెన్ వెంకటేశానికి కండ్లు సరిగ్గా కన్పించకపోవడం వల్ల సక్రమంగా విధులకు రావడం లేదని.. మానవతా దృక్ఫథంలో చూసీచూడనట్టు వదిలేస్తున్నామని అధికారులు చెప్పడం విస్తుపోయే అంశమని చెప్పాలి. మూడేండ్లుగా మానవతా దృక్ఫథం ఏంటో అధికారులకే తెలియాలి.

పైగా సదరు వెంకటేశం మాత్రం చెయ్యి విరిగిందని.. అనారోగ్యమంటూ కారణాలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎంపీడీఓ కార్యాలయ అధికారులు మాకు తెలియదంటూ మాకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది విధులకు డుమ్మా కొడితే.. ఎంపీడీఓకు సంబంధం ఉండదా..? లేక సూపరింటెండెంట్ పట్టించుకోరా..? ఉద్యోగులదీ ఎవరి ఇష్టం వారిదేనా..? అన్న ప్రశ్నలకు సమాధానం వారికే తెలియాలి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వాచ్మెన్ వెంకటేశం వ్యవహారాన్ని తేలుస్తారా..? లేదో వేచిచూడాలి.