calender_icon.png 13 January, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలాన్ల కోత ఖాతాల నుంచే!

13-01-2026 01:17:04 AM

ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ 

వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంక్ లింకింగ్ తప్పనిసరి చేయండి

ఇకపై చలాన్లపై డిస్కౌంట్లు బంద్

  1. మైనర్లకు బండిస్తే తల్లిదండ్రులపై కేసులు 
  2. ట్రాఫిక్ నియంత్రణే ప్రభుత్వ ప్రాధాన్యం
  3. ట్రాఫిక్ విభాగానికి స్వయంప్రతిపత్తి కల్పిస్తాం
  4. ‘అరైవ్ అలైవ్’ పోస్టర్ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): ‘ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల ఇక ఉపేక్ష వద్దు. రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్ డబ్బులు నేరుగా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా కఠిన విధానం తీసుకురావాలి. అప్పుడే జనంలో భయం, బాధ్యత వస్తుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ఏడాదికోసారి డిస్కౌంట్లు ఇస్తుందనే ధీమాతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకపై చలాన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కౌంట్లు ఇవ్వొద్దని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ట్రాఫిక్ విభాగం పూర్తిగా ప్రక్షాళన 

ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్లలో ట్రాఫిక్ విభాగం ఒక ఆరో వేలు మాదిరిగా తయారైందని సీఎం అభిప్రాయపడ్డారు. కమిషన ర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్పా ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదన్నారు. శాంతిభద్రతలు, నేరాల కంటే ట్రాఫిక్ సమస్యే ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అందుకే ట్రాఫిక్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి, పూర్తిస్థాయిలో స్వ యంప్రతిపత్తి కల్పిస్తామని వెల్లడించారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమా దం, ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3 శాతం నష్టం వాటిల్లుతోందని చెప్పారు.

ఈ మరణాలను మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావిం చాలి అని సీఎం పేర్కొన్నారు. చెరువుల రక్షణకు హైడ్రా, డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్, సైబర్ నేరాల కోసం ప్రత్యేక విభాగాలను ఎలా బలోపేతం చేశామో అదే స్ఫూ ర్తితో ట్రాఫిక్ వ్యవస్థను కూడా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తోందని, ఇకపై ఇదే తమ ప్రభుత్వ ప్రాధాన్య మని అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే, ఇకపై తల్లిదండ్రులపైనే కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్‌ల వల్లే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయన్నారు. 

బ్యాంకర్లతో మాట్లాడి కొత్త రూల్ తేవాలి

ప్రస్తుతం వాహనదారులకు జరిమానా వేస్తే సకాలంలో కట్టడం లేదని, స్పీడ్ గన్ ద్వారా చలాన్లు వేస్తున్నా డిస్కౌంట్లు వస్తాయని లైట్ తీసుకుంటున్నారని సీఎం చెప్పారు. ఈ పద్ధతి మారాలని, ఇకపై వాహన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే యజమాని బ్యాంక్ ఖాతాను వాహనానికి అనుసంధానించాలని అధికారులకు సూ చించారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే ఆటోమేటిక్‌గా వారి ఖాతా నుంచి జరిమానా డబ్బులు కట్ అయ్యేలా రూల్ తీసుకురావాలని ఆదేశించారు. బ్యాంకర్లతో మాట్లాడి సమ న్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.