22-01-2026 12:53:16 AM
నల్లగొండ క్రైం, జనవరి 21: ప్రత్యేక కేసుల్లో ఇoటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని సమర్థవంతంగా నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరం చేసినవారికి శిక్ష, నేరం చేయని వారికి రక్షణ అన్న లక్ష్యంతో పోలీస్ శాఖ పని చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నాణ్యమైన, సత్వర సేవలు అందించాలన్నారు. పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణను వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ప్రమాణాలను అమలు చేయాలని, జిల్లాలో దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్ను అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్థులపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. అక్రమ గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏదైనా నేరం జరిగిన వెంటనే బాధితులు ఫోన్ ద్వారా, మౌఖికంగా సమాచారం అందిస్తే, మహిళలు, చిన్నారులు తదితర బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వారి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్. బి డిఎస్పీ మల్లారెడ్డి,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు,దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.