calender_icon.png 23 November, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం

10-02-2025 01:16:36 AM

  1. సిద్దిపేట జిల్లాలో నమోదు
  2. చికిత్స పొందుతూ మహిళ మృతి
  3. 20 రోజులుగా వ్యాధితో పోరాటం

సిద్దిపేట, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తొలి జీబీఎస్ (గిలియాన్ బారే సిండ్రోమ్) మరణం నమోదైంది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ మృతిచెందింది. సుమా రు 20 రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆమె ఆస్పత్రిలో చేరగా, మెడికల్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు జీబీఎస్ వ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేశారు.

నిమ్స్ లో కొద్దిరోజులు చికిత్స అనంతరం ఆమె కుటుంబ సభ్యు లు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మహారాష్ట్రను జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలోనూ ఈ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ మహిళ మృతిచెందడంతో ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడిచేసే అరుదైన పరిస్థితిని గులియన్ బారే సిండ్రోమ్‌గా పేర్కొంటారు.

జీబీఎస్ సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపించడం, తీవ్రమైన జ్వరం, వాంతులు లాంటివి ప్రాథమిక లక్షణాలు. వీటితో పాటు పొత్తికడుపులో నొప్పి, నీరసంగా అనిపించడం, డయేరియా దీని లక్షణాలుగా చెప్పొచ్చు.