21-01-2026 01:13:04 AM
నేడు కివీస్‌తో తొలి టీ ట్వంటీ
వన్డే సిరీస్ ఓటమికి రివేంజ్ ప్లాన్
వరల్డ్‌కప్‌కు చివరి రిహార్సల్
టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 17 రోజులే మిగిలుంది. ఈ మెగా టోర్నీకి ముందు చివరి రిహార్సల్‌గా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కాబోతోంది. టీం కాంబినేషన్‌ను సెట్ చేసుకునేందుకు, ఫామ్‌లో లేని ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇదే చివరి అవకాశం. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదన్ కెప్టెన్సీకే కాదు వ్యక్తిగత బ్యాటింగ్ సత్తాకు సైతం ఇది పరీక్షగానే చెప్పాలి.
నాగ్‌పూర్, జనవరి 20: వన్డే సిరీస్ ఓటమితో కొత్త ఏడాదిని పేలవంగా ప్రారంభించిన టీమిండియా ఇప్పుడు ధనాధన్ సమరానికి రెడీ అయింది. ఐదు టీ ట్వంటీల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ బుధవారమే జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ చివరి రిహార్సల్‌గా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. వన్డే సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునూ ఫేవరెట్‌గా చెప్పలేం. అయితే గత ఏడాదిన్నర కాలంగా అంటే 2024 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచీ పొట్టి క్రికెట్‌లో భారత్‌కు ఎదురేలేదు.
ఆడిన ప్రతీ సిరీస్‌నూ సొంతం చేసుకుని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల ఆసీస్ గడ్డపైనా, తర్వాత సౌతాఫ్రికాపైనా వరుస సిరీస్ విజయాలతో దుమ్మురేపింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ క్రికెటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ మాత్రం భారత్ సత్తాకు పరీక్షగా భావిస్తున్నారు. మెగాటోర్నీకి ముందు ఇదే చివరి సిరీస్ కావడం, కొందరు ఆటగాళ్లు గాయాలతో దూరమవడం వంటివి ఇబ్బంది పెట్టేవే. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవగా.. రీప్లేస్‌మెంట్‌గా శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లను ఎంపిక చేశారు.
రీప్లేస్‌మెంట్స్ విషయంలో ఎటువంటి టెన్షన్ భారత్‌కు లేదు. కానీ తుది జట్టు కూర్పే పెద్ద సవాల్. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికే చోటు దక్కుతుంది. ఫామ్ పరంగా చూస్తే ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే టీ20 సిరీస్‌తో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా రీఎంట్రీ ఇస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కారణంగానే ఇటీవల వన్డే సిరీస్ నుంచి వీరిద్దరికీ రెస్ట్ ఇచ్చాడు. బుమ్రా, హార్థిక్ రాకతో భారత్ బలం మరింత పెరిగింది. వీరితో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా జట్టులోకి వచ్చాడు.
భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానం లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతున్న ట్టు కెప్టెన్ సూర్యకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అయ్యర్‌కు నిరాశే మిగులుతుందని భా విస్తున్నారు. అటు సూర్యకుమార్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. ఐదో ప్లేస్‌లో హార్థిక్ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్ దూబే బ్యా టింగ్‌కు దిగుతారు. కాగా ఈ సిరీస్ సూర్యకుమార్ బ్యా టింగ్ సత్తాకు అగ్నిపరీక్ష కానుంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్ కివీస్‌పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం.
అలాగే అక్షర్ పటేల్ కూడా ఆల్‌రౌండర్ కోటాలో ఆడతాడు. దీంతో కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. అటు పేస్ విభాగంలో బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు దక్కనుంది. ఒకవేళ అదనపు స్పిన్నర్ కావాలనుకుంటే దూబే, హర్షిత్ రాణాల్లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.మరోవైపు వన్డే సిరీస్ విజయం ఇచ్చిన జోష్‌తో ఉన్న న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేయాలని భావిస్తోంది. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు కివీస్‌కు కలిసొచ్చే అంశం. కాన్వే, రచిన్ రవీంద్ర , నీషమ్‌తో పాటు వన్డే సిరీస్‌లో అదరగొట్టిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ జట్టుకు అత్యంత కీలకం కాబోతున్నారు. అటు బౌలింగ్‌లో కెప్టెన్ శాంట్నర్‌తో పాటు ఇష్ సోధి, జాకబ్ డఫీపై అంచనాలున్నాయి.
గత రికార్డులు
టీ ట్వంటీ ఫార్మాట్‌లోనూ ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత రికార్డుల ప్రకారం కివీస్‌తో 25 టీ20లు ఆడిన భారత్ 12 మ్యాచ్‌లలో గెలిచింది. న్యూజిలాండ్ 10 విజయాలు సాధించగా.. మూడు మ్యాచ్‌లు టైగా ముగిసాయి.
పిచ్ రిపోర్ట్
నాగ్‌పూర్ పిచ్ ఔట్‌ఫీల్డ్ చాలా పెద్దగా ఉండడంతో బ్యాటర్లు తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ఈ పిచ్‌పై మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. 160 పరుగులు మంచి స్కోరుగా అంచనా.
తుది జట్లు అంచనా
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్. రింకూ సింగ్, హర్షిత్ రాణా/శివమ్ దూబే, అర్షదీప్/కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్: రాబిన్‌సన్, కాన్వే(కీపర్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, జిమ్మీ నీషమ్, మిఛెల్ శాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ