calender_icon.png 21 January, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ

21-01-2026 01:07:20 AM

వడోదర, జనవరి 20: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మిగిలిన జట్ల మధ్య గట్టిపోటీనే నడుస్తోంది. తాజాగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది. కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైని ఢిల్లీ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. నాట్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీ , హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు అందరూ నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో పేసర్ మారిజాన్ కాప్ చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. తన 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 8 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టింది.

మిగిలిన బౌలర్లలో శ్రీచరణి అదరగొట్టింది. ఆమె 33 పరుగులకు 3 కీలక వికెట్లు తీసింది. నందిని శర్మ , హామిల్టన్ , స్నేహ రాణా పర్వాలేదనిపించారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్  65 పరుగులతో సత్తా చాటింది. 155 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, లీ 7.3 ఓవర్లలోనే తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 29 (6 ఫోర్లు) పరుగులకు ఔటైనప్పటకీ.. లిజెల్లీ లా 46 పరుగులతో రాణించింది. తర్వాత వోల్వార్ట్ 17 పరుగులకు వెనుదిరిగింది. అయితే కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్   హాఫ్ సెంచరీతో దుమ్మురేపింది. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. కాప్ తో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేసింది.