calender_icon.png 12 December, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య, గిల్ పైనే ఫోకస్

11-12-2025 12:50:45 AM

వన్డే సిరీస్ విక్టరీ ఇచ్చిన జోష్‌తో టీ20 సిరీస్‌ను అదిరిపోయే విజయంతో ఆరంభించింది టీమిండియా.  పొట్టి క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ దుమ్మురేపింది. కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించింది. హార్థిక్ పాండ్యా మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శన విజయాన్ని అందిస్తే...టీ20ల్లో  కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్  పేలవ ఫామ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండో టీ20లోనైనా వీరిద్దరూ చెలరేగాలని అంతా ఎదురుచూస్తున్నారు.

  1. ఇవాళ సౌతాఫ్రికాతో రెండో టీ20

  2. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫామ్ అందుకుంటారా ?

తొలి మ్యాచ్‌లో పోటీ ఇవ్వని సౌతాఫ్రికా

మరో విజయంపై భారత్ కన్ను

ముల్లాన్‌పూర్, డిసెంబర్ 10: సౌతాఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం న్యూ ఛండీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది. తొలి టీ20లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా 1 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్‌లో హార్థిక్ పాండ్యా మెరుపులతో అదరగొడితే, బౌలింగ్‌లో అందరూ కలిసికట్టుగా రాణించారు.

దీంతో 101 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే తొలి టీ ట్వంటీలో కాంబినేషన్ బాగానే కుదిరింది. అయితే అంచనాలు పెట్టుకున్న కీలక బ్యాటర్లు మాత్రం నిరాశపరిచారు. ఓపెనర్లలో శుభమన్ గిల్ పేలవ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

సంజూ శాంసన్‌ను బెంచ్‌కు పరిమితం చేసి గిల్‌ను ఆడిస్తుండగా.. అతను మంచి ఆరంభాలనివ్వడంలో విఫలమవుతున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో అదరగొడుతున్న గిల్ షార్ట్ ఫార్మాట్‌లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ఖచ్చితంగా ఈ సిరీస్‌లో గాడిన పడాల్సిందే. అలాగే అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన టైమొచ్చింది. ఇదిలా ఉంటే మూడో స్థానంలో వస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఫామ్ కోల్పోయాడు.

కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఒక్కడీ ఆడలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో గిల్‌తో పాటు సూర్యకుమార్ ఫామ్‌పైనే అందరి చూపు ఉంది. గత 15 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంకా 9 మ్యాచ్‌లే మిగిలి ఉండడంతో సూర్య ఈ సిరీస్‌లో తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. అలాగే తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ధాటిగా ఆడితే తిరుగుండదు.

తొలి టీ20లో చెలరేగి హాఫ్ సెంచరీ చేసిన హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లోనూ రాణించాడు. అతనితో పాటు ఫినిషర్ రోల్‌లో జితేశ్ శర్మ మెరుపులు మెరిపిస్తే భారీ స్కోరు ఖాయం. అటు బౌలింగ్‌లో బుమ్రా, అర్షదీప్‌సింగ్ అదరగొడుతున్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా ఫామ్ కొనసాగిస్తుండగా... తుది జట్టులో మార్పులు లేనట్టే. దీంతో హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు నిరాశే మిగలనుంది.

మరోవైపు తొలి టీ20లో ఘోరపరాజయం పాలైన సౌతాఫ్రికా సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఆ ఓటమి నుంచి తేరుకుని భారత్‌ను దెబ్బకు దెబ్బ కొట్టడం అంత సులభం కాదు. సమిష్టిగా రాణిస్తేనే భారత్ జోరును అడ్డుకోగలమని సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌క్రమ్ చెబుతున్నాడు. సౌతాఫ్రికా తుది జట్టులో  ఆల్‌రౌండర్ కార్బిన్ బోస్చ్‌కు పిలుపు రావొచ్చు.

గత రికార్డులు

ఇరు జట్లు 32 టీ20ల్లో తలపడితే భారత్ 19 మ్యాచ్‌ల లో గెలిచింది. సౌతాఫికా 12 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

పిచ్ రిపోర్ట్

ముల్లాన్‌పూర్ పిచ్ బ్యా లెన్సింగ్‌గా ఉంటుందని అం చనా. ఆరంభంలో బ్యాటర్లు దూకుడు కనబరిచినా మ్యాచ్ సాగేకొద్దీ స్పి న్నర్లకు అడ్వాంటేజ్‌గా మారుతుందని భావిస్తు న్నారు. ఓవరాల్‌గా హైస్కోరింగ్ మ్యాచ్‌ను చూసే అవకాశాలున్నాయి.

భారత తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, జితే శ్ శర్మ (కీపర్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అ ర్షదీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

సౌతాఫ్రికా తుది జట్టు  (అంచనా)

డికాక్(కీపర్), మార్క్మ్ (కెప్టెన్), స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, మార్కో యెన్సన్, సిపామ్ల,/కార్బిన్ బోస్చ్) కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, నోర్జే