26-12-2025 01:20:41 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 25(విజయక్రాంతి): తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు గురువారం చేపట్టిన ఫ్లాష్ స్ట్రైక్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, యాజమాన్యాలు దిగిరాకపోతే డిసెంబర్ 31న అసలు సినిమా’ చూపిస్తామని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ హెచ్చరించారు. క్రిస్మస్ పర్వదినాన దాదాపు 40 వేల మంది కార్మికులు విధులను బహిష్కరించడంతో దేశం లోని ప్రధాన నగరాల్లో 50 నుంచి 60 శాతం డెలివరీ సేవలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ.. మేము ఆల్గోరిథమ్లకు బానిసలం కాదు. ప్రాణాలకు ముప్పు తెచ్చే 10 నిమిషాల డెలివరీ విధానాన్ని, అకారణంగా ఐడీలను బ్లాక్ చేయడాన్ని తక్షణం ఆపాలి అని డిమాండ్ చేశారు. కంపెనీలు థర్డ్ పార్టీల ద్వారా సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, లేదంటే న్యూ ఇయర్ డిసెంబర్ 31 వేళ నిరవధిక సమ్మెతో దేశవ్యాప్తంగా సేవలను స్తంభింపజేస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు.