02-11-2025 08:00:58 PM
కుల మతాలకు అతీతం..
ప్రతి ఏడాది మాలధారణ స్వాములకు అన్నదానం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కులమతాలు మాకు అడ్డుకావు... మేమంతా కలిసి మెలిసే ఉంటాం... హిందూ ముస్లిం భాయ్... భాయ్... అంటూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో మాలధారణ స్వాములకు అన్నదానం చేస్తూ ఐకమత్యాన్ని చాటుతున్నారు పాల్వంచ ముస్లిం సోదరులు కొందరు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి ఏడాది 500 మంది మాలధారణ స్వాములకు ముస్లిం యువకుడు ఎస్కే కలిష్ అన్నదానం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యప్ప దేవాలయంలో ఆదివారం ఎస్కే కలీష్ అనే వ్యక్తి మాలధారణ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో దీక్షలు చేస్తున్నటువంటి స్వాములకు అన్న ప్రసాదం వితరణ చేయాలని ఉద్దేశంతో 500 మంది స్వాములకు అన్న వితరణ చేశారు. ఒక ముస్లిం యువకుడు హిందువులకు చెందిన స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం పట్ల పలువురు అభినందించారు. ఈ సందర్బంగా మాలధారణ స్వాములు సదరు యువకుడిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యమహా రమేష్, అక్రమ్, బి శ్రీనివాస్ గురు స్వామి, భోగినేని శీను, సాయిని మహేంద్ర చౌదరి, భోగినేని సందీప్, బేతం శెట్టి వెంకట, మల్లెల నాగేందర్, రెడ్డి మల్ల మణికంఠ, ఎన్ పి చారి, రాజ్యలక్ష్మి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.