calender_icon.png 14 September, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజం కోసం!

27-06-2025 12:00:00 AM

డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి పెద్ద సామాజిక సమస్యగా పరిణమించింది. దేశ అభివృద్ధిలో చోదక శక్తి అయిన యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని  తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నది. చిన్న పట్టణాలనుంచి మెట్రోపాలిటన్ నగరాల వరకు డ్రగ్స్ వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతోంది.

అనేక విద్యాసంస్థలు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. యువత మత్తుకు ఆకర్షితులై బయటపడలేక తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26.9 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారని నివేదికలు వెల్లడించాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలు ఒకరోజు కాకుండా నిరంతరం జరగాలి.

వీటివల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు లోతైన అవగాహన కల్పించాలి. ఇందుకుగాను సమర్థవంతమైన, చట్టబద్ధమైన విధానాలను రూపొందించాలి. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, పౌర సమాజం, స్వచ్చంధ సంస్థలు సంయుక్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రగ్స్ వినియోగ వ్యతిరేక సమాచారం పెద్ద ఎత్తున పంపిణీ చేయాలి. అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా దేశాల మధ్యన సహకారం అవసరం.

మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి ముఖ్యంగా యువతలో చైతన్యం కలిగించాలి. నివారణ, చికిత్స, పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహించాలి. వర్క్ షాప్‌లు,  సదస్సులు, చర్చలు ఏర్పాటుచేయాలి. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల్లో గంజాయి సాగు అవుతున్నది.

మన దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వుంది. ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ పోర్టులు, ప్రైవేట్ పోర్టుల ద్వారా ఎక్కవ సప్లయ్ అవుతుంది. కృష్ణాపట్నం పోర్టు,  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ప్రపంచీకరణ కార్పొరెటీకరణ ప్రభావం వల్ల ఈ వ్యాపారం విస్తరిస్తున్నది.

2030 నాటికి మాదక ద్రవ్యాల వ్యాపారం 11 శాతం పెరిగిపోతుందని ‘ఐరాస’ నివేదిక పేర్కొంది. నషా ముక్త్ భారత్ అభియాన్ పథకం ద్వారా 272 జిల్లాలో 13,000 మంది వలంటర్లను నియమించి డ్రగ్స్‌ను అరికట్టే కార్యాచరణ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇందుకు యుధ్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం  పబ్బులు, క్లబ్బుల సంస్కృతికి స్వస్తి చెప్పాలి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజం ఉమ్మడి సమస్య. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన ప్రతి పౌరుని సామాజిక బాధ్యత. ఈ మృత్యుపిశాచి బారిన పడకుండా భవిష్యత్తు తరాలను కాపాడుకోవలసి ఉంది. ఇందుకు సమగ్ర మాదక ద్రవ్యాల వ్యతిరేక వ్యూహాన్ని అనుసరించాలి.

- నేదునూరి కనకయ్య