26-12-2025 02:29:03 AM
కిసాన్ జాగరణ్ అధ్యక్షులు, మేళా నిర్వాహకులు సగుణాకర్ రావు
కరీంనగర్, డిసెంబరు 25 (విజయ క్రాంతి) : దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధి జరగాలని కిసాన్ జాగరణ్ అధ్యక్షులు, మేళా నిర్వాహకులు పి. సుగుణాకర్ రావు అన్నారు. కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహిస్తున్న ‘కిసాన్ గ్రామీణ మేళా’ రెండవ రోజు కార్యక్రమాలు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ, మిడ్ మానేరు, ఎగువ మానేరు, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో నేడు ఒక వాటర్ జంక్షన్ (జల కూడలి)గా రూపాంతరం చెందిందని తెలిపారు.
సమృద్ధిగా నీటి వనరులు ఉన్న ఈ ప్రాంతంలో రైతులు కేవలం వరి పంటకే పరిమితం కాకుండా, చేపలు, రొయ్యల పెంపకం వంటి లాభసాటి రంగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఎల్. జలపతిరావు, ప్రముఖ వ్యవసాయ నిపుణులు వెంకటేశ్వర్లు, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రభాకర్, కరీంనగర్ డైరీ జనరల్ మేనేజర్ శంకర్ రెడ్డిలు రైతులు పాటించాల్సిన ఆధునిక సాగు పద్ధతులు, ఆదాయ వృద్ధి మార్గాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మేళా ప్రాంగణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎఫ్పీఓ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.