02-09-2025 12:00:00 AM
పరదాల మాటున నడుస్తున్న ప్రభుత్వ బడి..!
మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): గిరిజన ఆవాస ప్రాంతంలో బడి ఈడు గల పిల్లలకు అక్కడే విద్యనేర్పాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల క్రితం డిపెప్ పథకంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఇప్పటివరకు భవనం నిర్మించకపోవడంతో పాతికేళ్లుగా పరదాల మాటున ‘ప్రభుత్వ బడి’ని నిర్వహిస్తున్నారు.
బ్రహ్మంగారి తండాలో 150 కి పైగా నివాస గృహాలు ఉండగా బడి ఈడు గల పిల్లలు 40 మందికి పైగా ఉన్నారు. ఈ ఆవాస ప్రాంతంలోని పిల్లలకు అక్కడే విద్యనభ్యసించే విధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను 2001లో ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు భవనం నిర్మించకపోవడంతో తండావాసుల ఇండ్లలో, వరండాల్లో, చెట్ల కింద బడి నిర్వహిస్తున్నారు.
పాఠశాల నిర్మాణం కోసం కొంతకాలం స్థలం లేకపోవడం కారణంగా చూపి పక్కా భవనం నిర్మించకుం డా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం తండాకు చెంతనే ఉన్న కాలనీలో నాలుగు గుంటల భూమి ని ప్రభుత్వం పాఠశాల నిర్మాణానికి అప్పగించింది. దీనితో 2022లో గత ప్రభు త్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో 26 లక్షల రూపాయలతో పాఠశాల గదులు, విద్యుత్, నీటి వసతి కోసం కేటాయించింది.
కాంట్రాక్టర్ పనులు చేపట్టి పిల్లర్లు వేశాడు. ఇంతలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు కాంట్రాక్టర్ కు బిల్లు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిపివేశాడు. దీనికి తోడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రహరీ గోడ, టాయిలెట్ బ్లాక్, కిచెన్ షెడ్ నిర్మాణం చేపట్టకపోవడంతో బ్రహ్మంగారి తండా పాఠశాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
పాఠశాలకు మన ఊరు మనబడి, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇక మెరుగైన వసతి లభిస్తుందని ఆశిస్తే ఆశ నిరాశగా మారింది. తండాలో మెరుగైన వసతి లేని కారణంగా బడి ఈడు పిల్లలు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఫలితంగా ప్రస్తుతం20 మంది విద్యార్థులతో తండాలోని ఓ ఇంట్లో పరదాల మాటున ‘ప్రభుత్వ బడి’ ని మళ్ళీ కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.
పాతికేళ్లుగా నిరుపేద గిరిజన కుటుంబాల నివసించే బ్రహ్మంగారి తండాలో ప్రభుత్వ బడి పరదాల మాటున నిర్వహిస్తున్న పాలకులు పట్టించుకోవడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అధ్వాన్న స్థితిలో పరదాల మాటున నిర్వహిస్తున్న బ్రహ్మంగారి తండా పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు.