calender_icon.png 23 November, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవిపై ఫారినర్స్ యాక్ట్

23-11-2025 12:01:59 AM

  1. రంగంలోకి సీఐడీ స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్

నోరు విప్పని రవి!

గుర్తు లేదు, మర్చిపోయా అంటూ దాటవేత?

ఎథికల్ హ్యాకర్ల సాయంతో డిజిటల్ లాకులు తెరిచే పనిలో పోలీసులు

నిందితుడి ఖాతాల్లో రూ.20 కోట్లు గుర్తించిన ఈడీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రవిపై పోలీసులు తాజాగా ఫారినర్స్ యాక్ట్  కింద సెక్షన్లు నమోదు చేశారు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కలిగి ఉన్నాడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవ డంతో, విదేశీయులు ఇక్కడ నేరాలకు పాల్పడితే వర్తించే ఈ చట్టాన్ని ప్రయోగించారు.

తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇవ్వగా, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా శనివారం మూడో రోజు విచారణ జరిగింది. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా సైబర్ క్రైమ్ ఆఫీసులో రవిని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణలో రవి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

సినిమాలను ఎవరు సప్లు చేస్తున్నారు. ఏజెంట్లు ఎవరు.. గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలు ఏంటి. అనే కోణంలో ఆరా తీశారు. అయితే, రవి పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. కీలకమైన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, నెట్‌వర్క్ వివరాలు అడిగినప్పుడు గుర్తు లేదు.. మర్చిపో యా అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని తెలుస్తున్నది.

దీంతో పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. రవి వద్ద స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఎన్‌క్రిప్టెడ్ డేటాను తెరిచేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ డిజిటల్ సాక్ష్యాలే కేసులో కీలకం కానున్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు బలంగా అనుమానిస్తున్న ఈడీ అధికారులు, రవి బ్యాంక్ ఖాతాల్లో రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.

క్రిప్టో కరెన్సీ ద్వారా నెలకు రూ.15 లక్షల లావాదేవీలు జరిగినట్లు తేలింది. విదేశీ బ్యాంకులు, క్రిప్టో వాలెట్ల ద్వారా పెద్ద ఎత్తున సొమ్మును దాచినట్లు అనుమానిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా తెలంగాణ సీఐడీ అధికారులు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి, ఈడీ నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మట్లాడుతూ.. ‘విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఐబొమ్మ, ఐవిన్ బప్పం వంటి మొత్తం 17 పైరసీ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాడు.

ఇప్పటివరకు 21 వేలకు పైగా సినిమాలను పైరసీ చేసినట్లు అంగీకరించాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాం డ్స్, ఫ్రాన్స్ దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి, అశ్విన్ కుమార్, కిరణ్‌కుమార్ వంటి టెక్నికల్ వ్యక్తులకు లక్షలు చెల్లించి దందా నడిపిస్తున్నాడు. రవి ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశాలకు వెళ్తుంటాడు’ అని క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ వెల్లడించారు.