calender_icon.png 13 July, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో అడవి దొంగలు

12-07-2025 06:47:12 PM

యదేచ్చగా టేకు చెట్ల నరికివేత

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పరిధిలోని ఏజెన్సీ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న టేకు చెట్లను కొందరు దుండగులు అక్రమంగా నరికి తరలించుకు వెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిధిలోని గూడూరు, కొత్తగూడా, గంగారం మండలాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో టేకు చెట్లను కొందరు రాత్రికి రాత్రి రంపాలతో నరికి ఒకచోట డంపు చేసి అక్కడనుండి మరో చోటికి తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పలుచోట్ల అటవీ శాఖ నాటిన టేకు ప్లాంటేషన్లలోని టేకు చెట్లు కూడా రాత్రికి రాత్రే మాయమవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. టేకు చెట్ల నరికివేత అంశంలో అడవి దొంగలకు ఇంటి దొంగలు కొందరు సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫలితంగా అడ్డు అదుపు లేకుండా మహబూబాబాద్, గూడూర్ అటవీ ప్రాంతంలో అక్రమ కలప రవాణా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి, చెట్ల నరికివేతను అడ్డుకోవడంతోపాటు, చెట్లు నరికి అక్రమ రవాణాకు పాల్పడ్డ వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా గంగారం మండలంలో కొందరు అక్రమంగా టేకు చెట్లు నరికి ఒకచోట దాచి పెట్టిన విషయాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ కలపను స్వాధీనం చేసుకొని ఇల్లందు కలప డిపోకు తరలించినట్లు ఫారెస్ట్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.