12-07-2025 06:44:04 PM
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వాపురం వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సోయం హరిణి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సెంట్రల్ యూనివర్సిటీల్లో ఒకటైన ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ యూనివర్సిటీ(Dr BR Ambedkar University)లో ఎంఏ ఆర్కియాలజీలో సీటు సాధించింది. ఆమె తండ్రి శ్రీను వ్యవసాయదారుడు. తల్లి పద్మ గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా హరిణి పెద్దది. పది వరకు భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో, ఇంటర్మీడియట్ భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యనభ్యసించింది.
హైదరాబాద్ మేడ్చల్లోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ ఇటీవల పూర్తయ్యింది. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో తనకు పీజీ సీటు రావడంతో హర్షం వ్యక్తం చేస్తోంది. ఐఏఎస్ కావాలనేదే తన లక్ష్యమంటోంది. ఈ విషయం తెలుసుకున్న అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకుశాఅలీ, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు ధారావత్ హర్ష, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్,షేక్ షారుక్ పాషా, కోలా శశికాంత్ తదితరులు పాల్గొన్నారు