15-05-2025 01:57:22 AM
మేడ్చల్, మే 14(విజయ క్రాంతి): తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు సమీపంలో మావోయిస్టుల మందు పాతర కు బలైన ఘట్కేసర్ కు చెందిన జవాను తిక్క సందీప్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బుధవారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతు సహాయంగా రూ.3 లక్షలు సందీప్ తల్లికి అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సందీప్ మరణం బాధాకరమన్నారు. సందీప్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, తాను కూడా అండగా ఉంటానని అన్నారు. మల్లారెడ్డి వెంట పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.