calender_icon.png 27 August, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

27-08-2025 12:25:16 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, ఆగస్టు 26 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో డ్రైనేజీ లీకేజీలను అరికట్టి, విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని గాంధీ నగర్ సౌత్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ... గుర్రంగూడ అటవీప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజీ నీరు కాలనీ అంతటా ప్రవహిస్తున్నదన్నారు. వర్షపు నీటి నిల్వలతో చెత్తాచెదారంతో దుర్వాసన, దోమల సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సాగర్ కాంప్లెక్స్ ప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజీని ట్రంక్ లైన్లో కలపకుండా గుర్రంగూడ ఫారెస్ట్ నుంచి కాలనీల్లోకి వదిలేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం తెగిపోయిన కట్టను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను అదేశించారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి కస్నా నాయక్, జీహెచ్‌ఎంసీ అధికారులు సతీశ్ నాయక్, సుమన్ గౌడ్, ముద్దగోని సతీశ్ గౌడ్, అమర్త్య రెడ్డి, గాంధీ నగర్ సౌత్ కాలనీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, హరిహారపురం కాలనీ అధ్యక్షుడు శంకరయ్య, సెక్రటరీ సందీప్ రెడ్డి, వినూత్న ఎన్ క్లేవ్ అధ్యక్షుడు నరేన్ రెడ్డి, లుంబిని ఎలైట్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, గాంధీ నగర్ కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.