calender_icon.png 27 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదం జరిగాక కళ్లు తెరిచిన్రు!

27-08-2025 12:11:39 AM

  1. చేవెళ్ల మున్సిపాలిటీలో రోడ్డుకిరువైపులా షాపుల తొలగింపు
  2. పార్టీల జెండా దిమ్మెలు కూల్చివేత
  3. విగ్రహాల విషయంలో మాత్రం వెనకడుగు
  4. స్థానికుల నిరసన.. మరోచోటికి మార్చాలని డిమాండ్
  5. ట్రాఫిక్ పోలీసుల తీరుపైనా విమర్శలు
  6. ఫొటోలు తీయడం ఆపి... ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలని సూచన 

చేవెళ్ల, ఆగస్టు 26:  చేవెళ్ల మున్సిపల్ అధికారుల ప్రమాదం జరిగాక కళ్లు తెరిచారు.  మున్సిపాలిటీ కేంద్రంలోని బీజాపూర్ హైవేపై సోమవారం సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో వికారాబాద్ జిల్లాకు చెందిన తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే.  దీంతో మంగళవారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో బస్టాండ్ ఎదురుగా, రాజేందర్ రెడ్డి విగ్రహం పక్కన ఉన్న పూలు, పండ్లు, కూరగాయల డబ్బాలు, షాపులను తొలగించారు.  అలాగే పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ కు ఆనుకొని రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణాల తొలగించడంతో పాటు వివిధ రాజకీయ పార్టీల జెండా దిమ్మెలను కూడా నేలమట్టం చేశారు.  

రాజేందర్ రెడ్డి విగ్రహం వద్ద హైడ్రామా 

రాజేందర్ రెడ్డి విగ్రహం వద్ద షాపులు, డబ్బాల తొలగింపు సందర్భంగా కొద్దిసేపు హైడ్రామా నడిచింది.  షాపులు తొలగించిన అధికారులు రాజేందర్ రెడ్డి విగ్రహాన్ని వదిలేసి ముందుకు వెళ్లడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.  విగ్రహం ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తోందని, దాన్ని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు శంకర్పల్లి చౌరాస్తాలోని ఇంద్రారెడ్డి విగ్రహాన్ని కూడా ఇంకో చోటికి మా ర్చాలని కోరారు. ఈ విగ్రహం దిమ్మె కు  వాహనాలు ఢీకొని ఇప్పటికే పలువురు ప్రమాదాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే, అధికారులు  ప్రజాప్రతినిధులు,  ఆయా పార్టీల నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి.. దాటవేశారు. 

మిగితా చోట్లా షాపులు తొలగించాలని డిమాండ్

సమస్య తీవ్రతరం కావడంతో స్థానికులు, వివిధ పార్టీల నేతలు మీడియా, సోషల్ మీడియా ద్వారా నిరసనలు, డిమాండ్లు తెలిపారు.  రాజేందర్ రెడ్డి విగ్రహం, బస్టాండ్తో పాటు శంకర్పల్లి చౌరాస్తా,  పోలీస్ స్టేషన్ పక్కన వేంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే దారి వద్ద,  చేవెళ్ల గ్రామానికి వెళ్లే చోట ఉన్న డబ్బాలు,  షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు.  వీటితో పాటు షాబాద్ చౌరాస్తా నుంచి రంగారెడ్డి నగర్ కాలనీ కమాన్ వరకు ఉన్న డబ్బాలపైనా దృష్టి పెట్టాలని కోరారు.  అలాగే షాపులు కోల్పోయిన పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు  మార్కెట్ యార్డులోనో, మరో చోటనో అవకాశం ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించారు.   

ట్రాఫిక్ పోలీసులపై మండిపాటు

ట్రాఫిక్ పోలీసులకు స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసి వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేయడం, వసూలు చేయడం, డ్రంకెన్ డ్రైవ్ పై దృష్టి పెట్టడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.  కనీసం రోడ్లపై గుంతలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి మరమ్మతు చేయించడం లేదని విమర్శించారు.  స్థానిక ప్రజలే కాదు జర్నలిస్టులు,  ఎరువులు, విత్తనాల కోసం వచ్చే రైతుల వాహనాలను వదలిపెట్టడం లేదని, గుట్టుచప్పుడు కాకుండా ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వాహనాలు బ్రేక్ లైట్ తో రోడ్డు పక్కన ఆపినా ఫొటోలు తీస్తున్నారని, టౌన్ లోనే కాదు ముడిమ్యాల ఫారెస్ట్ లో ఎవరికీ కనిపించకుండా చెట్ల చాటు నుంచి స్పీడ్ గన్ తోనూ ఫైన్లు వేస్తున్నారని మండిపడ్డారు. 

విగ్రహాలు కూడా తొలగించాలి

చేవెళ్లలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులతో పాటు బస్డాండ్ పక్కన ఉన్న రాజేందర్ రెడ్డి విగ్రహం, శంకర్ పల్లి చౌరాస్తాలో ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహాలను తొలగించాలి.  వాటిని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉన్న మరో చోట ఏర్పాటు చేయాలి. అధికా రులు కొన్ని షాపులే తొలగించారు. మిగితావి కూడా తీసివేయాలి.

 కొజ్జంకి జైపాల్, చేవెళ్ల 

వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి

ట్రాఫిక్  రద్దీని దృష్టిలో పెట్టుకొని డబ్బాలు తొలగించిన అధికారులు చిరు వ్యాపారులకు ప్రత్యా మ్నాయం చూపాలి.   డబ్బాలు పెట్టుకొ ని పూలు, పండ్లు అమ్ము కొని జీవనం సాగించే వారి పట్ల ప్రభుత్వ మానవీయ కోణంలో ఆలోచన చేయాలి.  వారి పొట్టకొట్టకుండా మరోచోట డబ్బాలు పెట్టుకునే అవకాశం కల్పించాలి. 

 రామస్వామి, 

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు