calender_icon.png 27 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా వాళ్ళ ఇష్టమే..!

27-08-2025 12:13:44 AM

సమయానికి రారు.. పనులు చేయరు

డాక్యుమెంట్ రైటర్లు, కిందిస్థాయి సిబ్బందిదే హవా

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంతో పనుల నిమిత్తం వస్తూ నిత్యం పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10:00 గంటలకు రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన ప్రజలు 11:30 గంటల వరకు రిజిస్ట్రార్, సబ్ రిజిస్టార్లు రాకపోవడంతో ఎవరికీ చెప్పుకోవాలో అర్దం కావడం లేదని వాపోతున్నారు. ఈ విషయంలో విజయక్రాంతి పరిశీలించగా ఉదయం 11:30 గంటల వరకు అధికారులు రాకపోవడం కనిపించింది. అధికారుల గురించి కార్యాలయ సిబ్బందిని అడగగా ఏదేదో కహానీలు చెబుతున్నారని, ఇక్కడ అన్ని పనులు కిందిస్థాయి సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్ ఇలా ఒక్క రోజు మాత్రమే కాదని ప్రతీ రోజూ మధ్యాహ్నం అయితే కానీ ఆఫీస్ రారని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కోసం రావడం.. సారు ఎప్పుడు వస్తారోనని కళ్ళు కాయలు కాసే వరకు ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రామన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దృష్టి సారించాలని, అధికారులు సమయ పాలన పాటించి ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

డాక్యుమెంట్ రైటర్లు, దళారులదే హవా..

సంగారెడ్డి జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో రోజువారి రిజిస్ట్రేషన్ల కోసం వేచి చూస్తున్న ప్రజలు కార్యాలయంలో నిండిపోయినప్పటికీ అధికారులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, కిందిస్థాయి సిబ్బంది, మాత్రమే విధులు నిర్వహిస్తూ భూములు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తుదారులతో మంత ర్నాలు జరుపుతున్నారు. కొన్ని కౌంటర్లలో ఉన్నతాధికారులు ఎవరూ లేకుండానే పనులు  జరిగిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయమై కార్యాలయ సీనియర్ అధికారి ఖాన్ తో మాట్లాడగా కార్యాలయ తరలింపు విషయంలో అధికారులు బిజీగా ఉన్నందున ఆలస్యమైందని చెప్పారు.