27-08-2025 12:15:49 AM
శామీర్ పేట్ , ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసమస్యల పరిష్కరమే లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతి ని తీసుకొచ్చింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా , మండలాల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఈ నెల 15 వ తేదీలోగా సాధ్యమైనంత మేర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి చట్టం పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ స్థాయిల్లో పరిష్కరించే భూ సమస్యలను అధికారులు గుర్తించారు.
వీటిలో ప్రధానంగా పట్టాదారు భూములు అసైన్డ్, లావాణి, ప్రభుత్వ భూములుగా నమోదుకావడం, సరిహద్దు వివాదాలు, పేరు మార్పిడి వంటి వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. మిస్సింగ్ నెంబర్లు, పెండింగ్ మ్యుటేషన్, సర్వేనెంబర్లు, పేర్ల లో తప్పుల సవరణలతో పాటు చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ధరణి చట్టంలో లోపాలను సవరించి రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కొంత మంది అధికారుల అలసత్వంతో రెవెన్యూ సమస్యలు నెలల కొద్దీ అలాగే పెండింగ్ లో ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు చింతలపల్లి మండలంలో...
భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా భూ సమస్యల కోసం రైతుల నుండి దరఖాస్తులను రెవెన్యూ అధికారులు స్వీకరించారు. ఇందులో మూడు చింతలపల్లి మండలంలో 952కి పైగా భూ సమస్యలపై రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీటన్నిటిని ఆన్లైన్ చేసి ఆగస్టు 15 లోపు పరిష్కరించాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. కానీ మూడు చింతలపల్లి మండలంలో ఇప్పటివరకు 60కి పైగా దరఖాస్తుల ను మాత్రమే రెవెన్యూ అధికారులు పరిష్కరించటం విడ్డూరంగా ఉంది. ఆర్డీవో ,తహ సిల్దార్ స్థాయిలో పరిష్కరించే దరఖాస్తులను కూడా ఇప్పటివరకు ఇంకా రెవెన్యూ సిబ్బంది క్లియర్ చేయలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మాపూర్ లో 17 మాత్రమే...
మూడు చింతలపల్లి మండలంలో మేజర్ రెవెన్యూ గ్రామమైన లక్ష్మాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో రైతుల నుండి 392కి పైగా దరఖాస్తులను రెవెన్యూ అధికారులు స్వీకరించారు. కొన్ని ఏండ్లుగా లక్ష్మాపూర్ గ్రామ రైతులు చాలా ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ భూభారతి తో నైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు అనుకుంటే కానీ ఇప్పటివరకు అక్కడ కేవలం 17 దరఖాస్తులను మాత్రమే రెవెన్యూ అధికారులు పరిష్కరించడంపై అక్కడి నైతుల ఆశలు అడియాసలు అయినట్టేనా...?
ఇంకా ఆదేశాలు రాలేదు
మూడు చింతలపల్లి మండలం వ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను మా లైసెన్స్ సర్వేయర్ ద్వారా చేయవలసిన సమస్యలను పరిష్కరించాము. మండలంలో మేజర్ రెవెన్యూ సమస్య అయినా లక్ష్మాపూర్‌లో మాత్రం మేము చేయవలసినంత వరకు పరిష్కరించాము ఇంకా మిగిలి ఉన్న దరఖా స్తులకు కలెక్టర్ నుండి మాకు ఇంకా ఆదేశాలు రాలేదు వచ్చిన వెంటనే దరఖాస్తులను పరిష్కరిస్తాము.
డిప్యూటీ తహసీల్దార్, సునీల్‌కుమార్