27-08-2025 12:09:57 AM
హనుమకొండ,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, తదితర పనుల గురించిన వివరాలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు పనులు మంజూరై ఇంకా మొదలు పెట్టని కేంద్రాలలో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఈజీఎస్ పథకం కింద కొత్త భవనాల నిర్మాణాలు మొదలుపెట్టనిచోట్ల వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు. వరద నష్టం కారణంగా అంగన్వాడి కేంద్రాల భవన మరమ్మత్తు పనులు మంజూరైన కేంద్రాలలో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్ వైజర్లతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులు, ఆయా సెక్టార్ల పరిధిలో ప్రయివేట్ పాఠశాలల్లో ప్రీ స్కూల్ చదువుతున్న విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉండే చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారులు బరువు పెరగడానికి ఎలాంటి సదుపాయాలను కల్పిస్తున్నారు, తదితర వివరాలను డిడబ్ల్యువో, సిడిపిఓలు, అంగన్వాడి సూపర్వైజర్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన మూడు నెలల పూర్తి సమాచారంపై నివేదికను అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవల రికార్డుల నిర్వహణ సరిగ్గా నిర్వహించాలన్నారు.
కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ నిర్వహించాలన్నారు. ఈసీసీ ఈ విధానంలో సిలబస్, టైం టేబుల్ ను అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతినెల సామ్, మామ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. బాలింతలకు ఆరు నెలల వరకు ఐరన్ పోలిక్ మాత్రాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, అంగన్వాడి కేంద్రాల పనితీరును తెలియజేసే విధంగా గ్రేడింగ్ ఇవ్వాలన్నారు. లోప పోషణ కలిగిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్స్ తో వైద్య సేవలను అందించాలన్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రీ స్కూల్ చిన్నారుల అభివృద్ధి పరిశీలన చేయాలని తెలియజేశారు.