16-09-2025 12:27:02 AM
మోతె, సెప్టెంబర్ 15 : మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూర్ కుటుంబాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, కోదాడ శాసనసభ్యులు నలమాద పద్మావతిరెడ్డి లు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక పరిస్థితి రోజువారి జీవన విధానంపై ఆరా తీశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూర్ కుటుంబానికి గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు 3 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామన్నారు.
ఇతర ప్రాంతాలలో ఉన్న మల్సూర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారంతోపాటు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించడానికి రాష్ట్ర మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మాజీ ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేటకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి తన తుది శ్వాస విడిచే వరకు నిబద్దతతో నిజాయితీగా పనిచేశారన్నారు.
అటువంటి నాయకుడి విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారెడ్డి, నూకల మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.