27-01-2026 12:00:00 AM
నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ...
బాన్సువాడ, జనవరి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత మృతి యాదృచ్ఛిక ఘటన కాదని, ఇది అధికారుల నిర్లక్ష్యం, అహంకారం, అక్రమాల ఫలితమని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
సోమవారం గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్ధృత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాఠశాలకు చెందిన ఫర్నిచర్ను అక్రమంగా తరలించడం, రాత్రి వేళ విద్యార్థుల చేతే కుర్చీలు దిగుమతి చేయించడం నేరపూరిత చర్యలేనని స్పష్టం చేశారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఈ ఘటనలో ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.
ఆటో నుంచి విద్యార్థినులు దూకుతున్న దృశ్యాలు బయటపడినా, ఇప్పటివరకు బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దోషులను కాపాడేందుకే దర్యాప్తును నీరుగారుస్తున్నారా? అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు మౌనంగా ఉన్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.ప్రిన్సిపాల్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, ఈ ఘటనపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాల్సిందేనని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు, ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి, విద్యార్థిని మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైతే, బీజేపీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనకు నిరసనగా బాన్సువాడ పట్టణంలో అఖిలపక్ష నాయకులతో కలిసి సుమారు గంటపాటు తీవ్ర ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతు న్న బీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్కు తరలించడం పాలనా దమనకాండకు నిదర్శనమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్, నాయకులు కొండని గంగారం, భూమేష్, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కఠినన చర్యలు తీసుకోవాలి
బీజేపీ, బీఆర్‌ఎస్, మోచి సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో..
బాన్సువాడ, జనవరి 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని సంగీత మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి, బిఆర్‌ఎస్, మోచి సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి విద్యార్థి మృతికి కారకులైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే ప్రిన్సిపాల్ కు సహకరించిన పాఠశాల టీచర్లపై సిబ్బందిపై విచార చేపట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు విద్యార్థి సంఘాల సభ్యులు విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
పాఠశాల ప్రధాన గేటు ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ప్రిన్సిపల్ సునీత ఇంట్లో పూజ కార్యక్రమానికి గురుకుల పాటశాల నుండి కుర్చీలు తీసుకువెళ్ళింది.కార్యక్రమం ముగిసిన తర్వాత కుర్చీలు గురుకుల పాటశాలకు పంపింది. ఆటోలో నుండి సిబ్బంది,విద్యార్తినులు కుర్చీలు దించారు.ఆటో నుండి కుర్చీలు దించేసి ఆటో తిరిగి వెళ్ళే క్రమంలో ముగ్గురు విద్యార్థులు ఆటోలో ఎక్కారూ.డ్రైవర్ ఆటో ఆపాక పోవడంతో ఒకరొకరు క్రిందకి దూకారు అదే క్రమంలో సంగీత కు తీవ్ర గాయాలయి రక్త స్రావం జరిగి అక్కడే మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అప్పటివరకు రాస్తారోకోలు విరమించేది లేదని నాయకులు తేల్చి చెప్పడంతో సంఘటన స్థలానికి బాన్సువాడ పట్టణ సీఐ శ్రీధర్ తో పాటు పోలీసులు రాష్ట్ర చేస్తున్న నాయకులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా గురుకుల పాఠశాల వద్ద ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి గది వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విద్యార్థిని ఉతికి కారకులైన ప్రిన్సిపాల్ సునీతను సస్పెండ్ చేస్తామని కారకులైన వారిపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కిరణ్మయి వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థి సంఘాల నాయకులు మోచి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.