calender_icon.png 27 January, 2026 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్గారంలో రాజకీయ రంగుల కలకలం

27-01-2026 12:00:00 AM

కాంగ్రెస్ నాయకులపై మాజీ సర్పంచ్ సున్నం రాంబాబు ఆగ్రహం

అశ్వాపురం, జనవరి 26 (విజయక్రాంతి): ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని సోమవారం  అశ్వాపురం మండలం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జగ్గారం మాజీ సర్పంచ్ సున్నం రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగ్గారం గ్రామంలోని బిఆర్‌ఎస్ పార్టీ దిమ్మకు అర్థరాత్రి దొంగల్లాగా కాంగ్రెస్ రంగులు వేయడం నీచ సంస్కృతి అని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నాలుగు దఫాలుగా తాను, తన భార్య తిరుపతమ్మ జగ్గారం సర్పంచ్లుగా కొనసాగుతున్నామని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు తమ వైపే నిలిచారని గుర్తు చేశారు.

తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తున్నాయని, అయితే ఒక గిరిజన అభ్యర్థి వరుసగా నాలుగుసార్లు గెలవడాన్ని జీర్ణించుకోలేని నాయకులు ఇటువంటి అడ్డదారి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మీకు చేతనైతే ఎదురుగా పోరాడాలి తప్ప, అర్థరాత్రి పూట దిమ్మలకు రంగులు మార్చడం ఏంటి?‘ అని ఆయన ప్రశ్నించారు.

మీకు అధికారం ఉంటే పంచాయతీకి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని, కానీ పార్టీ దిమ్మలపై రంగులు వేయడం వల్ల ప్రయోజనం లేదని హితవు పలికారు. గిరిజనుడనే చులకన భావంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని నిలదీశారు. తక్షణమే ఆ దిమ్మకు వేసిన రంగులను మార్చాలని, లేనిపక్షంలో అధికారులే స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, ఒకవేళ న్యాయం జరగకపోతే తాము తదుపరి చర్యలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.