28-09-2025 12:58:29 AM
-సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ
-రావిర్యాలఆమనగల్ రేడియల్ రోడ్డు పనులు షురూ
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర రాజధానిని ఆనుకుని భారత్ భవిష్యత్ నగరం (ఫ్యూచర్ సిటీ) నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూ పొందించింది. ఇందులో భాగంగా ఆదివారం సీ ఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి పునాదిరాయి వేయనున్నారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో..
ఈ నూతన భవిష్యత్ నగర నిర్మాణానికి ప్రభు త్వం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఫ్యూచర్ సిటీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మం డలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరి ధిలో ఉండనుంది. ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్‌సీడీఏకు కేటాయించారు.
అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో..
హైదరాబాద్ మహా నగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని సీఎం సంకల్పించారు. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లతోపాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జీ ఉండేలా పర్యావరణహిత నగరంగా ఉండే కార్యక్రమాల్ని ప్రభుత్వం ఇక్కడ అమలు చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
లైవ్,లెర్న్,వర్క్, ప్లే కాన్సెప్ట్‌తో..
ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీని లైవ్,లెర్న్,వర్క్,ప్లే కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ పరిశ్రమలతోపాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, షాపింగ్ సెంటర్లు.. అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉంటాయి. ఫార్మాతోపాటు హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
మెట్రో ఫేజ్‌ే అనుసంధానం
మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది.. ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ. ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)లను కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించనున్నారు.
రావిర్యాల్ నుంచి అమన్‌గల్‌కు రేడియల్ రోడ్డు
ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల్ (టాటా ఇంటర్చేంజ్) నుంచి త్రిబుల్ ఆర్ అమన్‌గల్ (రతన్ టాటా రోడ్) వరకు గ్రీన్‌ఫీల్ రేడియల్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం 41.50 కి.మీ.ల మేర నిర్మించనున్నారు. మొదటి దశలో రావిర్యాల్ టాటా ఇంటర్చేంజ్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.20 కి.మీ.లు, రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి అమన్‌గల్ వరకు 22.30 కి.మీ.ల చేపట్టనున్నారు. ఈ రోడ్డు 14 గ్రామాల గుండా వెళ్తుంది. ఈ ప్రాజక్టును రూ.4,621 కోట్లతో చేపట్టనున్నారు. ఈ రోడ్డు ఓఆర్‌ఆర్, త్రిబుల్ ఆర్‌ను నేరుగా కలిపి, దక్షిణ జిల్లాలకు ప్రయాణ సమయం తగ్గిస్తుంది. ప్రస్తుత మార్గాలపై రద్దీ తగ్గుతుంది.