04-05-2025 08:08:33 PM
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులకు ఆదివారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao), జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధిలో భాగంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రహదారుల నిర్మాణం ద్వారా మంచిర్యాల పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉండదని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మంచిర్యాల పట్టణాన్ని అన్ని హంగులతో ఆధునికరించడం జరుగుతుందని తెలిపారు.
పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 9 రంగపేట, వార్డ్ 17 బృందావన కాలనీ, వార్డ్-4 రాజరాజేశ్వర కాలనీ, రోడ్ నెంబర్-17 సూర్య నగర్, వార్డు-3 లలో సీసీ రహదారులు, మురుగు కాలువల పనులను ప్రారంభించారు. హమాలివాడలోని హనుమాన్ ఆలయం సమీపంలో సీసీ రహదారి, వార్డ్-1 గాంధీనగర్ లో బిటి రహదారుల పనులను ప్రారంభించారు.
అలాగే గాంధీనగర్ నుంచి రాజీవ్ నగర్ వరకు రూ. 3. 58 కోట్లతో టియుఎఫ్ఐడిసి నిధులతో బిటి రహదారి నిర్మాణానికి, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా నుండి శ్రీనివాస గార్డెన్ వరకు హైదరాబాద్-కరీంనగర్-చాందా రహదారిపై 251/9 నుంచి 255/7 వరకు రూ.16.6 కోట్ల వ్యయంతో 6 వరుసల బిటి రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాలలో రోడ్లు భవనాల శాఖ ఈఈ భవర్ సింగ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ లతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.