05-05-2025 12:21:35 AM
నెక్కొండ డోర్నకల్ మధ్య కొనసాగుతున్న పనులు
ఇక అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు
రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు
కొన్ని స్టేషన్లలో ఇబ్బందులు
మహబూబాబాద్, మే 4 (విజయ క్రాంతి): ఖాజీపేట విజయవాడ రైల్వే మార్గంలో పెరుగుతున్న రైళ్ల రద్దీని తగ్గించడానికి 219 కిలోమీటర్ల మేర 1,952 కోట్ల వ్యయంతో చేపట్టిన మూడో రైల్వే లైన్ పనులు ముమ్మరంగా చక చక సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 184 కిలో మీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 35 కిలోమీటర్లు మూడో లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. 2025 చివరి నాటికి మూడో లైన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఉంది.
ఇందులో భాగంగా తెలంగాణలో ఖాజీపేట డోర్నకల్ జంక్షన్ మధ్య ముమ్మ రంగా సాగుతున్నాయి. ఇప్పటికే కాజీపేట నుంచి నెక్కొండ వరకు 36 కిలోమీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ పనులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నెక్కొండ నుంచి డోర్నకల్ జంక్షన్ వరకు 53 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
కాజీపేట డోర్నకల్ రైల్వే జంక్షన్ ల మధ్య చేపట్టిన మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా 104 మైనర్ బ్రిడ్జిలు నిర్మించారు. రెండు చోట్ల పెద్ద వంతెనలు నిర్మించారు. అలాగే రోడ్ క్రాసింగ్ ఉన్న మూడు చోట్ల కొత్తగా రైల్వే అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇక నెక్కొండ నుంచి డోర్నకల్ వరకు ఉన్న ఇంటికన్నె, కేసముద్రం, తాళ్లపూసపల్లి, మహబూబాబాద్, గుండ్రాతి మడుగు, గార్ల రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్ ఫారాల మరమ్మత్తు, ఇతర అభివృద్ధి ప నులు నిర్వహిస్తున్నారు.
ఫలితంగా ఇంతకాలం ఏలాంటి అభివృద్ధికి నోచుకోని చింతలపల్లి, ఏలుగూరు, నెక్కొండ, ఇంటికన్నె, కేసముద్రం, తాళ్లపూస పల్లి, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల రైల్వే స్టేషన్లు ఇప్పుడు మూడో లైన్ నిర్మాణంలో భాగంగా కొత్త సొబగులతో ముస్తాబవుతున్నాయి.
బీడీ ట్రాక్ గా మూడో రైల్వే లైన్
కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్ జంక్షన్ వరకు చేపట్టిన మూడో రైల్వే లైన్ ను బీడీ లైన్ గా నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న రెండు రైల్వే మార్గాల్లో ఒకటి ఎగువ వైపు వెళ్లే రైళ్లకు, మరోటి దిగువ వైపు వెళ్లే రైళ్లను నడిపే విధంగా నిర్మించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న మూడో లైన్ పూర్తిగా (బై డైరెక్షనల్) బీడీ లైన్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఎగువ, దిగువ మార్గాల్లో వెళ్లే రైళ్లు మూడో లైన్ లో ప్రయాణించేందుకు వీలుగా ట్రాక్ కు క్రాసింగ్ లు రూపొందించి ఇప్పటికే ఉన్న ఎగువ దిగువ రైల్వే ట్రాక్ లకు అనుసంధానించారు.
దీనివల్ల సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లతో పాటు ప్రయాణికుల రైళ్లను అంతరాయం లేకుండా నడిపేందుకు అనువుగా ఉంటుంది. దీనివల్ల రైళ్ల రద్దీని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉండడంతో ఇక కాజీపేట డోర్నకల్ సెక్షన్ లో ప్రయాణికుల రైళ్ళు వెళ్లడానికి గూడ్స్ రైళ్లను గంటల తరబడి నిలిపి ఉంచే పరిస్థితి తొలగిపోనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కాజీపేట నుండి నెక్కొండ వరకు బీడీ లైన్ నిర్మాణం పూర్తి చేసి కొద్ది నెలలుగా రైళ్ళను నడిపిస్తున్నారు. దీనితో కాజీపేట నెక్కొండ వరకు ఏక బిగిన మూడు లైన్ల పై రైళ్ళు ప్రయాణిస్తున్నాయి.
కొన్నిచోట్ల ప్రయాణికులకు ఇబ్బందులు
మూడవ రైల్వే లైన్ నిర్మాణం వల్ల కొన్ని ప్రధాన స్టేషన్లలో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తు న్నారు. కేసముద్రం, మహబూబాబాద్, నెక్కొండ రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం రెండు ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. అయితే ఎగువ (అప్) మార్గాన మూడవ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడున్న రెండవ నెంబర్ ప్లాట్ ఫామ్ పక్కనే ట్రాక్ నిర్మిస్తుండగా ఆ పక్కన ప్లాట్ఫారం నిర్మించకపోవడంతో మూడో లైన్ దాటి రెండవ ప్లాట్ ఫామ్ పైకి రావడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు.
ప్రధాన రైల్వే స్టేషన్లలో మూడో లైన్ నిర్మిస్తున్న చోట మరో లైన్ వేయడానికి ముందస్తుగా పనులు చేపట్టి మరో ప్లాట్ ఫామ్ నిర్మించి మూడు ప్లాట్ ఫారాలను అనుసంధానిస్తూ ప్రయాణికులు సులువుగా ఎక్కి దిగడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఒక్క మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో మాత్రమే రెండు వైపులా రైల్వే టిక్కెట్ బుకింగ్ ఆఫీస్ ఉండగా, ఇతర స్టేషన్లో ఒకవైపు మాత్రమే టిక్కెట్ బుకింగ్ ఆఫీసులు ఉన్నాయి.
దీనివల్ల ప్రయాణికులు ఎగువ మార్గంలో ప్రయాణించే సమయంలో దిగువ మార్గంలో ఉన్న స్టేషన్ కు వెళ్లి టికెట్ తీసుకొని మళ్లీ ఎగువ మార్గానికి రావడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి ‘సీ’ కేటగిరి స్టేషన్లలో ఎగువ మార్గంలో కూడా టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా పలు రైల్వే గేట్లను మూసివేశారు.
ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడంతో ప్రజలు, వాహనదారులు కిలోమీటర్ల కొద్ది ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. గార్ల, రంగాపురం వద్ద గేట్లను తొలగించడంతో ప్రజలు నెలల తరబడి ట్రాక్ దాటేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్యూబి, ఆర్‌ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మహబూబాబాద్ జిల్లా పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న మూడో లైన్ కారణంగా పలు స్టేషన్లలో రైలు ప్రయాణికు లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. డోర్నకల్ నుంచి నెక్కొండ వరకు ఉన్న రైల్వే స్టేషన్లలో మూడవ ప్లాట్ఫారం కూడా నిర్మించాలి. ప్రయాణికులకు ఆయా రైల్వేస్టేషన్లలో అదనంగా బుకింగ్ కౌంటర్లు లేదంటే ఏటీవీఎం మిషన్లు ఏర్పాటు చేయాలి.
దీనికి తోడు మహబూబాబాద్, కేసముద్రం పట్టణాలు రైల్వేస్టేషన్ కు ఇరువైపులా విస్తరించి ఉన్నాయి. రైల్వే ప్లాట్ఫారాలకు సంబంధం లేకుండా నేరుగా పట్టణ ప్రజలు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి. ప్రయాణికుల సమస్యలను ఇప్పటికే రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాను. ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తా.
డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎమ్మెల్యే, మహబూబాబాద్