18-12-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (విజయక్రాంతి): స్కూల్ యూనిఫామ్ బాగాలేదని స్నేహితులు అనడంతో మనస్థాపానికి గురైన నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చందానగర్ డివిజన్ పరిధిలో గల రాజేందర్‌రెడ్డి కాలనీలో జరిగింది. రాజేందర్‌రెడ్డి నగర్‌లో ఉంటున్న శంకర్ కుమారుడు ప్రశాంత్ (9) కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో తోటి స్నేహితులు యూనిఫామ్ సరిగా లేదని ఆటపట్టించినట్టుగా తెలిసింది.
దీంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్.. మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత బాత్రూమ్‌కు వెళ్లి.. బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగా ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు తన స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్‌తో ఉరేసుకున్నట్టు సమాచారం.
చదువులో చురుకుగా ఉండే ప్రశాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న వయస్సులోనే ఇలా ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటన్నది మర్మంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందానగర్ ఎస్సై ఆంజనేయులు ఘటనపై కేసు దర్యాప్తు ప్రారంభించారు.