calender_icon.png 30 January, 2026 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

30-01-2026 06:46:17 PM

అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్పు

కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ... మా సంకల్పం గొప్పది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, అన్ని వనరులు సమకూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ఎదిగే వయసులో పిల్లలకు సరైన ఆహారం లేక పరిపూర్ణంగా ఎదగలేక పోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుందని తెలిపారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయాం అనే భావన కులం, మతం, ధనిక, పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తుందని తెలిపారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజక వర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు ఉండాలి. మానవ వనరులకు సానపడితేనే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది అందుకు కావలసింది ఉచితంగా అందరికీ విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వం ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే దృష్టి సారించి ముందుకు పోతుందని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే పాఠశాల నిర్వాహకులు పిలవగానే గత సంవత్సరం జనవరి మాసంలో సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి పది కోట్లు కేటాయించారని వివరించారు.

ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత పాలకులు ఐఐటీలను అనాధలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలని, ఆధునిక యంత్ర పరికరాలను తీసుకువచ్చి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవసరమైన సిలబస్ను రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా  తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు.

రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి  పంపిణీ చేస్తున్నాం వారిని మహాలక్ష్ములుగా గౌరవిస్తున్నామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం మొదటి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామంటే అంతా నవ్వారు కానీ మేం పట్టుదలతో మొదటి ఏడాది 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసి ఇది సాధ్యమని నిరూపించినట్లు వివరించారు.

హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు అని వివరించారు. దివంగత ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ  గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హ రగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని తెలిపారు. 

మేధావులను తెచ్చింది.. దేశానికి ఇచ్చింది..

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మొదలుకొని, ఆచార్య హరగోపాల్ దాకా ఎంతోమంది మేధావులను  మొగిలిగిద్ద పాఠశాల అందించిందని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు. . ప్రభుత్వానికి అయినా, సంస్థలకు అయినా ఒక చరిత్ర కొలమానం అవుతుందని, ఈ గ్రామంలో కూడా తుర్రెబాజ్ ఖాన్ లాంటి పోరాటయోధుల చరిత్ర ఎండి ఉందని అన్నారు. విద్యాలయాలను అందించి గ్రామ గ్రామాన విద్యను వ్యాపింప చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, ఆనాటి పండిత్ నెహ్రూ ఏర్పాటుచేసిన పంచవర్ష ప్రణాళిక ద్వారానే విద్యారంగానికి మేలు జరిగిందని పేర్కొన్నారు.

అయితే ఈరోజు అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులతో కొనసాగుతున్న ప్రభుత్వ స్కూల్ లని వదిలేసి పైపై మెరుగులు కనిపించే ప్రైవేటు పాఠశాలల మీద తల్లిదండ్రులు ఆధారపడడం, ఉచిత చదువులు వదిలి అధిక ఫీజుల కోసం అప్పులు చేయడం బాధాకరమని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి తీసుకువచ్చి అందరూ ఇక్కడే చదివేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.  రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి సహకరించగలిగితే విద్యాలయాలు దేవాలయాలుగా మారతాయని ఆయన పేర్కొన్నారు. 150 ఏళ్ల వర్షపు ఉత్సవాన్ని జరుపుకుంటున్న మొగిలిగిద్ద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, బోధనా రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.

గత ప్రభుత్వం దత్తత తీసుకొని ద్రోహం చేసింది: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పది సంవత్సరాల కేంద్ర, రాష్ట్రాల పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యారంగాన్ని అన్ని విధాలా బాగు చేసే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.   ఇన్నేళ్ల చరిత్రలో ఈ పాఠశాల ఎంతోమందిని విద్యార్థులుగా తీర్చిదిద్దని అన్నారు.   గత ప్రభుత్వం ఈ పాఠశాలను దత్తత తీసుకున్నామని ప్రకటించి ఒక్క పని కూడా చేయకుండా గాలికి వదిలేసిందని అన్నారు. పదేళ్ల పాలనలో ఆ ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని గుర్తు చేశారు. పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులకు, బాలికలకు శౌచాలయాలు కూడా లేని పరిస్థితి తన దృష్టికి వస్తే వెంటనే నిర్మించాలని గుర్తు చేశారు.

ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోడు గుర్రాలల ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా విద్యాలయాల ఏర్పాటు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. మొగిలిగిద్ద గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం, అడ్వాన్స్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, దీని ద్వారా త్వరలోనే మొగలిగిద్ద రూపరేఖలు మారిపోతాయని స్పష్టం చేశారు.

ప్రజలు గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులతో ముందుకు వెళుతున్నది అన్నది స్పష్టంగా పరిశీలించాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బండారి సంతోష జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు