30-10-2025 01:38:09 AM
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ డాక్టర్ శబరీష్.పి
ములుగు, అక్టోబరు29 (విజయక్రాంతి): 10 రోజుల పాటు ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఉచిత కంటి పొర శస్త్ర చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. పి స్వయంగా సందర్శించి, సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమైన సినీనటుడు సంజోష్‌ను అభినందించారు సంజో ష్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఎంఈఎస్‌యూ హైదరాబాద్, విజన్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ ఫౌండర్ రాచుపల్లి ఉపేంద్ర సహకారంతో ఈ శిబిరం ఏటూరునాగారం మండలంలోని గిరిజన భవన్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు విస్తృతంగా స్పందించగా.. సుమారు 1000 మంది ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 168 మంది రోగులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తన స్వస్థల ప్రజల కోసం సంజోష్ ఇంత విలువైన సేవా కార్యక్రమం చేపట్టడం నిజంగా ప్రశంసనీయం.
ప్రస్తుతం చాలామంది తమ ఊరిని మరిచిపోతున్న వేళ, సంజోష్ లాంటి యువత తమ ప్రజల కోసం కృషి చేయడం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. తదనంతరం ఎస్పీ శంకర నేత్రాలయ వైద్యులను శాలువాలతో సత్కరించి, ఆశ వర్కర్లకు 15,000 చెక్కును సంజోష్, రాచుపల్లి ఉపేంద్ర అందజేశారు.