19-08-2025 12:00:00 AM
మహాదేవపూర్, (భూపాల్ పల్లి) జులై 18 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలం సూరారం గ్రామం లో అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జగదీష్ కన్నా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కాలానికి ఆనుగుణంగా సంభవించే చిన్న చిన్న వ్యాధులను పరిశీలించి, జ్వర పీడితుల కు రక్త నమూనాలను స్వీకరించి వెంటనే ఫలితాలు తెలిపి, అధిక రక్తపోటు, చక్కర వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
అనంతరం డాక్టర్ గ్రామస్తులతో మాట్లా డుతూ ధూమపానం, మద్యపానం చేయరాదని, రెండు వారాల కు మించి దగ్గు ఉన్నట్లయితే తెమడ పరీక్షలు చేయించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఖాళీ సీసా లు, డబ్బాలు, తాగి పడేసిన కొబ్బరి బొండాల చిప్పలు, పగిలిన డ్రమ్ము లు లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్‌ఎం కనకదుర్గ, శైలజ, ఆశాలు శ్రీదేవి, సారక్క, శారద పాల్గొన్నారు.