13-07-2025 01:27:35 AM
- నిజాంకు వ్యతిరేక పోరులో కీలక పాత్ర
- మంత్రి ఉత్తమ్ సంతాపం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు(96) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్ర వారం రాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక తరం యోధుడు కనుమరుగైనట్లయింది.
1940వ దశకంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన సా యుధ పోరాటంలో దొడ్డ నారాయణరావు చురుకైన పాత్ర పోషించారు. కమ్యూ నిస్టు భావజాలంతో ప్రజల పక్షాన నిలిచి, ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అనంతరం సీపీఐ నల్గొం డ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రైతాంగ సమస్యల పరిష్కా రానికి విశేష కృషి చేశారు.
సీపీఐ జాతీయ నేత నారాయణ సంతాపం
దొడ్డ నారాయణరావు మృతి పట్ల సీపీఐ జాతీయ సీనియర్ నాయకుడు కే నారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం చివరి శ్వాస వరకు నిలబడిన మహోన్నత వ్యక్తి దొడ్డ నారాయణ రావు. ఆయ న జీవితం నేటి తరానికి ఆదర్శం‘ అని ఆయన కొనియాడారు. నారాయణరావు మృతి పట్ల పలువురు కమ్యూనిస్టు నాయకులు ప్రతినిధులు సంతాపం తెలిపారు.
నారాయణరావు సేవలు అనిర్వచనీయం: మంత్రి ఉత్తమ్
దొడ్డ నారాయణరావు మరణం పట్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డ నారాయణరావు అందించిన సేవలు అనిర్వచనీయమైన ఘట్టంగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు. గ్రంథాలయ ఉద్యమంలో నారాయణరావు పాత్ర వర్తమానానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన లోటు పూడ్చలేనదని తెలిపారు.