calender_icon.png 5 May, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటినుంచి ‘రెతు ముంగిట్లో శాసవేత్తలు’

05-05-2025 02:31:14 AM

  1. జూన్ 13వరకు రైతులకు అవగాహన కార్యక్రమాలు
  2. 1,200 గ్రామాల్లో పర్యటించనున్న 200 మంది శాస్త్రవేత్తల బృందాలు 
  3. ఒక్కో వారం ఒక్కో గ్రామం చొప్పున.. ఆరువారాల్లో ఆరు గ్రామాల పర్యటన 
  4. యూరియా తగ్గింపు, పంటల మార్పిడిపై అవగాహన  
  5. మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం చేపట్టనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో సోమవారం నుంచి జూన్ 13 వరకు రాష్ట్రంలోని 1,200 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఒక బృందంలో నలుగురు శాస్త్రవేత్తల చొప్పున మొత్తం 200 బృందాల వరకు ఏర్పాటు చేసినట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందం ఒక వారంలో ఒక గ్రామం చొప్పున..ఆరు వారాల్లో 6 గ్రామాలను పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసినట్లు చెప్పారు.

దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మండలాల్లో 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాల చొప్పున  పాల్గొంటాయని మంత్రి తెలిపారు. ఈ బృందాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో రైతు వేదికల్లో లేదంటే వేరే ఇతర ప్రదేశంలో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.

యూరియా వాడకం తగ్గిం చడం, రసాయనాలను జాగ్రత్తగా వాడటం, చెల్లింపు రశీదులను భద్రపర్చడం, సాగునీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచడం వంటి అంశాలపై అవగాహనతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ బృం దంలో శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను కూడా భాగస్వా మ్యం చేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్వహించేదని, కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.

తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చాక రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. వ్యవసాయ సంబంధిత అంశాలను శాస్త్రవేత్తల ద్వారా రైతులు నివృత్తి చేసుకోవాలని సూచించారు.