calender_icon.png 14 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో తాగునీటికి నిధులు లేవ్

14-09-2025 12:40:24 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి నిధుల కొరత తీర్చాలి
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. ఎర్రగడ్డలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  4. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ సహా తాగునీటికి హైదరాబాద్‌లో నిధుల కొరత ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిధుల కొరత లేకండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూడాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో రూ.2.94 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఎర్రగడ్డ డివిజన్‌లోని భారత్ నగర్ ఎక్స్ రోడ్డుతో పాటు నేతాజీ నగర్, సుల్తాన్ నగర్, ప్రేమ్ నగర్, శంకర్ లాల్ నగర్, రాజీవ్ నగర్లలో మొత్తం 11 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతమని అందరూ అనుకుంటారని, కానీ ఇక్కడి ప్రజలు మురుగు నీరు, తాగునీటి సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలను ఆదుకుంటామని వెల్లడించారు.

జోరుగా సంక్షేమ పథకాలు: మంత్రి పొన్నం 

హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్‌లో 11 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి ప్రభాకర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కృషిని ఆయన గుర్తు చేశారు. హిమాయత్ సాగర్, మంజీర, నిజాం సాగర్, గోదావరి ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 1, 2 జలాలను కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ తెస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు  అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హంధన్, స్థానిక కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, షాహిన్ బేగం పాల్గొన్నారు.