23-07-2025 03:44:00 PM
ఫలించిన ఎమ్మెల్యే విజయరమణ రావు కృషి
స్పందించిన ప్రభుత్వం ఇక పర్యాటక ప్రాంతంగా సబ్బితం, పర్యాటకులకు తీరనున్న కష్టాలు
పెద్దపల్లి,(విజయక్రాంతి): నియోజకవర్గంలోని సబ్బితం గట్టు సింగారం గ్రామంలోని జలపాతం అభివృద్ధికి పర్యాటక శాఖ రూ. 6 కోట్లు మంజూరు చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(Peddapalli MLA Chinthakunta Vijayaramana Rao) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సబ్బితం జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి ఆ జలపాతాన్ని సందర్శించి ఎమ్మెల్యే అధికారులతో కలిసి కలియ తిరిగారు. ఆ క్రమంలో సబ్బితం జలపాతం వద్ద పర్యాటకులు పడుతున్న ఇక్కట్లను తీర్చడానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, గతంలో ఎంతో మంది ఎందరో ప్రజా ప్రతినిధులు సబ్బితం జలపాతాన్ని సందర్శించి దానిని అభివృధి చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడిపారని ఎమ్మెల్యే అన్నారు. సబ్బితం గట్టు సింగారం జలపాత అభివృద్ధి కోసం రూ.6 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిధులు మంజూరుకు సహకరించిన జిల్లా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపారు.