16-05-2025 12:19:26 AM
-తెలంగాణ సినిమా వేదిక డిమాండ్
ఖైరతాబాద్, మే 15 (విజయక్రాంతి): తెలంగాణ సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయమై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేదిక గౌరవ సలహా దారుడు ప్రపుల్ రాంరెడ్డి, కన్వీనర్ లారా, కో కన్వీనర్ మోహన్ బైరాగి మాట్లాడారు.
రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తవుతున్నా ఆంధ్ర సినిమా పెద్దలదే పెత్తనం నడుస్తుందన్నారు. 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రత్యేక తెలంగాణ అనంతరం తెలంగాణ మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌గా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. 24 క్రాఫ్ట్‌లలో ఆంధ్ర ఫిలిం ఛాంబర్ లో సభ్యత్వం ఉన్నవారినే తీసుకోవాల్సి వస్తోందని, లేనిపక్షంలో తెలంగాణ సినిమాను ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంద న్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ, ఆంధ్ర సిని మా విభజన చేయాలని, 100 ఎకరాల్లో తెలంగాణ ఫిలిం స్టూడియోను ఏర్పాటుచేయాలని, గద్దర్ అవార్డులను తెలంగాణ సినిమాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విభజన సమయంలో నిర్ణయించిన తెలంగాణ సినిమా వాటాను ప్రకటించి, వెంటనే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు జైహింద్‌గౌడ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.